Raj Thackeray: 20 ఏళ్ల తరువాత ఒక్కటైన ఠాక్రే సోదరులు

20 ఏళ్ల తరువాత ఒక్కటైన ఠాక్రే సోదరులు

Raj Thackeray : దాదాపు 20 ఏళ్ల అనంతరం శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే (Raj Thackeray) ఒకే రాజకీయ వేదికపై మెరిశారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబయిలోని వర్లిలో ఠాక్రే సోదరులు ఉమ్మడిగా ‘మరాఠీచా’ పేరుతో విజయోత్సవం నిర్వహించారు. ‘దక్షిణ భారత దేశంలోని ప్రముఖులెందరో ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నప్పటికీ తమ మాతృభాషలైన తెలుగు, తమిళం విషయంలో ఎంతో గౌరవంతో ఉంటారు. అలాగే మహారాష్ట్ర ప్రజలకు తమ భాషపై అభిమానం ఉంటుంది. హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు. అలా అని ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం ఊరుకోం’ అని రాజ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

Raj Thackeray – Uddhav Thackeray

బాల్‌ ఠాక్రేతోపాటు ఇతరులెవరూ చేయలేనిది… సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ చేశారని, తమను కలిపారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘మీకు విధాన సభలో బలం ఉండవచ్చు… మాకు వీధుల్లో బలముంది’ అని పేర్కొన్నారు. ‘మేం కలిసి ముందుకు సాగడానికే ఒకటయ్యాం. ముంబయి స్థానిక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటాం’ అని ఉద్ధవ్‌ ఉద్ఘాటించారు.

ఠాక్రే సోదరులది రుదాలీ సభ – ఫడణవీస్‌

ఠాక్రే సోదరుల సభను ‘రుదాలీ’ (సంతాపం తెలిపే వ్యక్తుల) సభగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అభివర్ణించారు. తమ సోదరుల కలయికకు తానే కారణమన్నా రాజ్‌ ఠాక్రేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘బాలాసాహెబ్‌ ఠాక్రే నన్ను తప్పక ఆశీర్వదించాలి. మీరు విజయోత్సవంగా నిర్వహించిన ర్యాలీ రుదాలీ ప్రసంగంగా మారింది’ అని విరుచుకపడ్డారు. మరోవైపు ఠాక్రే సోదరుల ఉమ్మడి సభ రాజకీయ భవిష్యత్తు పునరుద్ధరణకు నిరాశతో కూడిన ప్రయత్నంగా భాజపా నాయకులు విమర్శలు కురిపించారు.

Also Read : PM Modi: దలైలామా శాంతికి రూపం – ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!