Raj Thackeray: బీజేపీపై రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

బీజేపీపై రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

 

బీజేపీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్‌, థాక్రే బ్రాండ్లను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. దీనితో ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌థాక్రే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… థాక్రే బ్రాండ్‌ అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అది అంత సులభం కాదు. థాక్రే బ్రాండ్‌ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ థాక్రే మహారాష్ట్రపై మొదటి ప్రభావాన్ని చూపారు. ఆయన తర్వాత, బాలాసాహెబ్ థాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్‌ థాక్రే తమదైన ముద్ర వేశారు. అనంతరం థాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్‌ థాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని అన్నారు.

ఇదే సమయంలో… ‘నేను ఒక ఫోటో చూశాను. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తత్కరే, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, ఛగన్ భుజ్‌బాల్, ఇతర నాయకుల మధ్యలో కూర్చున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. బీజేపీ మద్దతుదారులు దానిని ఎలా చూస్తున్నారో ఆలోచించాను ?. మేము వారికి అధికారం రాకుండా ఎంతో కష్టపడ్డామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో కూర్చున్నారు అని ఆలోచిస్తున్నారు. ఇది వారి మనసులో ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

అనంతరం పహల్గాం ఘటనపై స్పందిస్తూ… ‘పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ?. పాకిస్తాన్‌తో యుద్ధం అనేది ఒక ఎంపిక కాదు. మనం చేసింది యుద్ధం కూడా కాదు. యుద్ధం గురించి మీకు ఏం తెలుసు ?. గాజాను చూడండి, అప్పుడు యుద్ధం ఎలాంటి విధ్వంసం తెస్తుందో మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్‌ పై మన దాడులు పర్వాలేదు. కానీ, మన 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? వారు ఇప్పటికీ పరారీలో ఉన్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!