Rajani Vidadala : ర్యాగింగ్ పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం
ఎవరు పాల్పడిన చర్యలు తప్పవు
Rajani Vidadala : తెలంగాణకు చెందిన డాక్టర్ ధరావత్ ప్రీతి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ మొత్తం వ్యవహారంపై ముందస్తు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కాలేజీలు, ఆస్పత్రులలో ఎక్కడ కూడా ర్యాగింగ్ అనే పదం వాడేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని(Rajani Vidadala) సమీక్ష చేపట్టారు. వైద్య విద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ప్రీతి ఘటనను ఆమె ఉదహరించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడినా లేదా ప్రోత్సహించినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు మంత్రి విడుదల రజని. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ కొద్దిగా అనుమానం వచ్చినా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
మంగళగిరి లోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు విడదల రజని(Rajani Vidadala). ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ ఒక్కరు దీనికి పాల్పడినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే విద్యార్థులను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదన్నారు.
ర్యాగింగ్ అనేది ఎవరు చేసినా నేరమేనని, దీని గురించి ముందు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. అన్నిచోట్లా కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
Also Read : కడుపు శోకం వెల కట్టలేం