Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ చీఫ్‌ గా రాజీవ్ చంద్రశేఖర్

కేరళ బీజేపీ చీఫ్‌ గా రాజీవ్ చంద్రశేఖర్

Rajeev Chandrasekhar : దక్షిణాదిలో పాగా వేయడానికి జేపీ నడ్డా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కేరళ బీజేపీ కొత్త చీఫ్‌గా కేంద్ర మాజీ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌(Rajeev Chandrasekhar) ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఆదివారంనాడు తిరువనంతపురంలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ కేరళ ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్, కో-ఇన్‌చార్జి, లోక్‌సభ ఎంపీ అపరాజిత సారంగి ఈ సమావేశానికి హాజరయ్యారు. కౌడియర్‌ లోని ఉదయ్ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారంనాడు నిర్వహించే పార్టీ సదస్సులో అధికారికంగా రాజీవ్ చంద్రశేఖర్‌ నియామకాన్ని ప్రకటించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజీవ్ చంద్రశేఖర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Rajeev Chandrasekhar – సమర్ధుడైన నేతగా గుర్తింపు పొందిన రాజీవ్ చంద్రశేఖర్

గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో చంద్రశేఖర్ పనితీరు బీజేపీ(BJP) నేతల ప్రశంసలు అందుకుంది. తిరువనంతపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేత శశిథరూర్‌ పై ఆయన పోటీ పడ్డారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనగా చివరి నిమిషంలో ప్రచారబరిలోకి దిగిన చంద్రశేఖర్ కేవలం 16,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ స్వల్పకాలిక ప్రయోజనాలు సాధించగలిగితే, అసెంబ్లీ ఎన్నికల నాటికి దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించవచ్చని పార్టీ అధిష్ఠానం యోచనగా ఉంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకుంది. హిందూ, క్రిస్టియన్ ఓటర్లకు దగ్గరవడం, విద్యావంతులైన యువకులను పార్టీ వైపు ఆకర్షించడం బీజేపీ(BJP) వ్యూహంగా ఉంది.

నాయర్ కమ్యూనిటీకి చెందిన చంద్రశేఖర్ అగ్రవర్గ హిందూ ఓట్లను గంపగుత్తగా ఆకర్షించగలరని పార్టీ అంచనా వేస్తోంది. కేరళలో క్రిస్టియన్లు, ముస్లింలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పట్టు ఉంది. ఈ రెండు కమ్యూనిటీల మధ్య ఆధిపత్య పోరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించే బలమైన నేత పార్టీకి అవసరమని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర జనాభాలో 19 శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అయితే వీరంతా కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్, సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ పట్ల అసంతృప్తితో ఉన్నారని, తమ ఆందోళనలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వారిలో బలంగా ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది.

అక్టోబర్‌లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రశేఖర్‌ కు మెుదటి సవాలు కానుంది. తిరువనంతపురం మున్సిపల్ కౌన్సిల్‌ పై ఆయన ప్రధానంగా దృష్టిసారించి తొలి విజయం సాధిస్తే, పార్టీకి గణనీయమైన క్యాడర్ ఉన్న నెమామ్, కజకూట్టం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పట్టు పెరుగుతుంది. కేరళ బీజేపీలోని గ్రూపులను కూడా చంద్రశేఖర్ సమన్వయ పరచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని గ్రూపులు ఆయనను బయట వ్యక్తిగా భావిస్తున్నాయి. మోదీ ఆకర్షణ, అమిత్‌షా వ్యూహానికి తోడు బీజేపీ అభివృద్ధి ఎజెండాను కేరళలో ముందుకు తీసుకువెళ్లగలగిన బలమైన నాయకుడు అవసరమని, ఆ దిశగానే బీజేపీ పావులు కదుపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Temple Chariot: బెంగుళూరు జాతరలో అపశృతి ! కుప్పకూలిన 120 అడుగుల రథం !

Leave A Reply

Your Email Id will not be published!