Rakesh Tikait : రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ – టికాయత్
హర్యానా రైతులపై దాష్టీకం చెల్లదు
Rakesh Tikait : తాము పండించిన పొద్దు తిరుగుడు విత్తనాలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ హర్యానా కురుక్షేత్ర లోని షహాబాద్ లో జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులపై ఖాకీలు ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు భారత కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait). ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఖాకీల దాడులను తీవ్రంగా ఖండించారు.
దేశానికి ధాన్యాలను పండించే అన్నదాతలపై దాడులకు దిగడం దారుణమన్నారు. ఇది పరాకాష్టకు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో రైతులంతా కలిసి ముందుకు కదిలితే తుపాకులు, తూటాలు ఏమీ చేయలేవని హెచ్చరించారు. ఇంకోసారి గనుక రైతులతో పెట్టుకుంటే మాడి మసై పోతారని హెచ్చరించారు రాకేశ్ టికాయత్. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
కనీస మద్దతు ధర ఇస్తామని కేంద్రం మాట ఇచ్చిందని, కానీ ఇచ్చిన మాట తప్పిందని ఆరోపించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న చరిత్ర మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఖాకీలు ఒళ్లు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయాలని, రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అందుకు బదులు తీర్చుకుంటామన్నారు. ఇక మహిళా రెజ్లర్ల విషయంలో సమస్య పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు మంచిదేనని పేర్కొన్నారు.
Also Read : Nara Lokesh : ఇంకానా ఇకపై చెల్లదు – లోకేష్