Ramachander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు
Ramachander Rao : ‘కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఏవీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వంపై బీజేపీ ధర్మయుద్ధం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. నాయకులు, కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో బీజేపీ (BJP) ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా’ అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు, పార్టీ ముఖ్య నేతలు హాజరై అభినందించారు.
Ramachander Rao As BJP State Chief
అంతకుముందు ఉదయం పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన రామచందర్‌రావు (Ramachander Rao).. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోగా కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం జరిగిన సభలో చెప్పారు. బహుశా ఆ నాయకులు నాలుక జారి మాట్లాడినట్లున్నారు. 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిచేది భాజపానే. మోదీ ప్రభుత్వం తెలంగాణకు 12 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసింది. అదనంగా 2 లక్షల టన్నులు మంజూరు చేసింది. అయినా యూరియా లేదంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ పార్టీ మతపరమైన రాజకీయాలతో రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలను చేర్చింది’’ అని రామచందర్‌రావు ఆరోపించారు. ఎంపీ ఈటల రాజేందర్ కొత్త అధ్యక్షుడిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
600 రోజులు అవుతున్నా హామీల అమలేదీ?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. 600 రోజులు అవుతున్నా అమలు కావడం లేదు. 6 గ్యారంటీల్లో 63 అనుబంధ హామీలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతకాలతో ఊరూరా పంచారు. సోనియా, రాహుల్‌గాంధీ సంతకాలతో వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు కానందున తమను కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారు’’ అని రామచందర్‌రావు లేఖలో పేర్కొన్నారు. వెంటనే వాటిని అమలు చేయాలని సీఎంను కోరారు.
Also Read : Minister Ponnam Prabhakar: సీఎం రేవంత్ కు బీజేపీ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
