Red Alert: దేశంలో విస్తారంగా వర్షాలు ! 8 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ !

దేశంలో విస్తారంగా వర్షాలు ! 8 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ !

Red Alert : రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా సోమవారం విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీనితో దేశ రాజధాని దిల్లీతోపాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది. రానున్న ఆరు నుంచి ఏడు రోజుల వరకూ ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అంతేకాదు వరద పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో పలుచోట్ల రెడ్‌ అలర్ట్‌ (Red Alert) జారీ చేసారు. రానున్న నెల రోజుల్లో తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. అయితే ఈశాన్య, తూర్పు భారతాలతో పాటు దక్షిణాదిలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుందని వెల్లడించింది.

Red Alert – భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ లో ముగ్గురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh) రాష్ట్రాన్ని భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వర్షాల కారణంగా హిమాచల్‌లో మరణాల సంఖ్య 20కి పెరిగింది. సిమ్లాలో 5 అంతస్తుల ఓ భవనం సోమవారం కుప్పకూలింది. అందులో నివాసం ఉంటున్నవారు ముందుగానే బయటపడడంతో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదు. భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని 259 రోడ్లను మూసివేశారు. సోలన్‌లో ఒక వంతెన కొట్టుకుపోయింది. చంబా, కాంగ్రా, కులూ, మండీ, శిమ్లా, సోలన్, సిర్మోర్‌ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో వరద ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశాలో ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. బాలాసోర్, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో సుబర్ణరేఖ, బుద్ధబలంగ్, జాలక, సోనో నదులు పొంగిపొర్లుతున్నాయి. సుబర్ణరేఖ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. బాలాసోర్, మయూర్‌భంజ్‌ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలో తేలిక నుంచి ఒక మోస్తరు వరకూ వర్షాలు కురిశాయి. చండీగడ్‌తో పాటు పంజాబ్, హరియాణాలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి.

250 రోడ్లు మూసివేత ! 130 చోట్ల కరెంట్‌ కట్‌ !

హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh) ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం 130 ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద చేరడం, ధ్వంసం కావడం వంటి కారణాలతో 250 రోడ్లను అధికారులు మూసివేశారు. ఇందులో అత్యధికంగా సిర్మౌర్‌ జిల్లాలో 57, మండి జిల్లాలో 44 రోడ్లున్నాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న 22 ప్రాంతాలకుగాను 18 చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సొలాన్‌ జిల్లాల్లో సోమవారం స్కూళ్లను మూసివేశారు.ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. పర్యాటక ప్రాధాన్యమున్న సిమ్లా–కల్కా రైలు మార్గంపైన చేరిన రాళ్లు, చెట్లను తొలగించే రాకపోకలకు వీలు కల్పించారు.

Also Read : Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!