Manoj Soni: యూపీఎస్సీ ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా !

యూపీఎస్సీ ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా !

Manoj Soni: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణావలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్‌ నెలలోనే బాధ్యతలు చేపట్టిన మనోజ్‌ సోనీ.. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ వివాదం వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Manoj Soni Resign

అయితే, ఈ వివాదంతో మనోజ్‌ సోనీ(Manoj Soni) రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి. అయితే, దీన్ని ఇంకా ఆమోదించలేదని సదరు వర్గాలు తెలిపాయి. 2017లో యూపీఎస్సీ(UPSC) కమిషన్‌లో సభ్యుడిగా చేరి గతేడాది మే నెలలో ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

ఇంకా 2029 మే 15 వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే, ఛైర్మన్‌ పదవి చేపట్టడానికి ఆయన ముందునుంచి సుముఖంగా లేరని తాజా సమాచారం. తనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని గతంలోనే ఓసారి అభ్యర్థించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని సోనీ కోరుకుంటున్నట్లు సదరు వర్గాలు తెలుపుతున్నాయి. యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి ముందు ఆయన గుజరాత్‌లోని డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వరుసగా రెండుసార్లు వీసీగా ఉన్నారు.

అఖిలభారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెకు శుక్రవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

Also Read : Pooja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ పై ఫోర్జరీ కేసు లో అరెస్టు !

Leave A Reply

Your Email Id will not be published!