Assam Floods: అస్సాంలో వరదలు ! ఉప్పొంగుతున్న నదులు !
అస్సాంలో వరదలు ! ఉప్పొంగుతున్న నదులు !
Assam Floods: ఈశాన్య రాష్ట్రం అస్సాం(Assam)ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని కారణంగా 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. దీనితో అస్సాంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Assam Floods Update
నిమతి ఘాట్, గువాహటి, గోల్పరా, ధుబ్రి ప్రాంతాల్లో బ్రహ్మపుత నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దాని ఉపనదులైన బుర్హి దిహింగ్, డికౌ, దిసాంగ్, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి కూడా గ్రామాలను అతలాకుతలం చేస్తున్నాయి. కమ్రూప్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపానుల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 64కి చేరింది.
వేల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 63,490 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అత్యధికంగా ధుబ్రి జిల్లాలో 7 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దర్రాంగ్‌లో 1,86,108.. బార్పేటలో 1,39,399.. మెరిగావ్‌లో 1,46,045 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 47,103 మంది వరద బాధితులు 612 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది రాష్ట్రంలో ఆరుసార్లు వరదలు సంభవించాయి. వరదల కారణంగా కజిరంగా నేషనల్ పార్క్‌లో ఇప్పటివరకు 31 జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ దిబ్రూగఢ్‌లోని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. అందరిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మృణాల్ సైకియా తన మొబైల్ కిచెన్ ద్వారా వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.
Also Read : NEET UG Counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా !