RK Roja Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదు
జనసేన చీఫ్ పై రోజా సెటైర్లు
RK Roja Pawan Kalyan : నటుడిగా తప్ప పవన్ కళ్యాణ్ ఇంక దేనికీ పనికి రాడంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏపీ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి ఇవాళ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం దారుణమన్నారు. సోమవారం రోజా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివే అలవాటు కలిగిన పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మరన్నారు. ప్రతి నటుడికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్నారు. ఇక ముమ్మాటికీ జనసేన రౌడీ సేననే అంటూ నిప్పులు చెరిగారు మంత్రి. జనసేన పార్టీ కార్యకర్తలు తమ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఆర్కే రోజా(RK Roja).
వాళ్లను చూస్తే జాలి కలుగుతోందన్నారు. 2019లో వైసీపీని ఓడిస్తానన్న పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) అసెంబ్లీ గేటు వద్దకు కూడా రానివ్వ లేదని , ఆ షాక్ మరిచి పోతే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇక నుంచైనా ఏది పడితే అది మాట్లాడటం మానుకోవాలని సూచించారు. సినిమా షూటింగ్ మధ్యలో వచ్చి నాలుగు మాటలు మాట్లాడితే నాయకుడు అయి పోరని గుర్తించాలని అన్నారు ఆర్కే రోజా.
డైలాగులు సినిమాల్లో బాగుంటాయని నిజ జీవితంలో సీన్ దానికి భిన్నంగా ఉంటుందని తెలుసు కోవాలని హితవు పలికారు. లేక పోతే మరోసారి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అందుకోసం వేచి చూస్తున్నారని చెప్పారు మంత్రి.
Also Read : ‘బండి’కి హైకోర్టు లైన్ క్లియర్