RS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి – ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
RS Praveen Kumar : తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ పారదర్శకంగా నడుస్తుందన్న నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని భారత రాష్ట్ర సమితి తరఫున కోరుతున్నట్లు ఆ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. ఈ విషయమై గవర్నర్ ను విజ్ఞప్తి చేస్తామని… హైకోర్టుకు నివేదిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ అభద్రతాభావంలోకి నెట్టేశారని, భారత రాష్ట్ర సమితి కీలక నేతలతోపాటు రాష్ట్ర మంత్రుల ఫోన్లనూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
RS Praveen Kumar Demands
తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) మాట్లాడుతూ… ‘‘ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) పై విచారణ చేస్తూనే రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి బీజేపీ కూడా మద్దతిస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ప్రైవసీ లేకుండా పోయింది. సీఎం అక్రమ ఆదేశాలు, మెప్పు కోసం రాజ్యాంగ హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల్ని వదలబోం. కేసీఆర్, కేటీఆర్ కాదు.. ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న రేవంత్‌రెడ్డి ముందు జైలుకు వెళ్తారు. సిట్‌కు ఇప్పటికే నేను సమాధానం పంపించాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్క అధికారినే పదే పదే విచారణకు పిలవడం సరికాదు. ఇతర అధికారులను కూడా పిలిచి విచారించాలి’’ అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
కులగణన, ఆర్డినెన్స్ పేరిట బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోంది – కేటీఆర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ది మోసపూరిత వైఖరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కులగణన, ఆర్డినెన్స్ పేరిట బీసీలను ఆ పార్టీ మోసం చేస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీసీలను మోసం చేసేందుకే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటోంది. బీసీల సంఖ్య తగ్గించి చూపడంలోనే కాంగ్రెస్ దురుద్దేశం తెలుస్తోంది. చట్టం ఆమోదం పొందదని తెలిసీ.. బీసీలను మోసం చేస్తోంది. ఇప్పుడు కోర్టుల పేరుతో తప్పించుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది’’అని కేటీఆర్ విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్ర – కవిత
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. కానీ రిజర్వేషన్లకు మతం రంగుపులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్రం ప్రభుత్వం పంపలేదని కవిత ఆరోపించారు.
‘‘రాష్ట్రంలో బీజేపీకు ఓట్లు రావని తెలిసే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చలేమని మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ… దక్షిణాదిలో న్యాయపరమైన సమస్యలు అంటూ దాటవేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు 50 సార్లు దిల్లీ వెళ్లినా… ఈ అంశంలో ప్రధానిపై ఒత్తిడి తేలేదు. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తే 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసి రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.
Also Read : Extra Marital Affairs: నలుగురు పిల్లలు, భర్తను కాదని ప్రియుడితో మహిళ జంప్ !
