Sambhal Violence: సంభాల్ హింసాకాండలో జామా మసీదు చీఫ్ జాఫర్ అలి అరెస్టు

సంభాల్ హింసాకాండలో జామా మసీదు చీఫ్ జాఫర్ అలి అరెస్టు

Sambhal Violence : మొఘులుల కాలం నాటి మసీదు రీసర్వే సందర్భంగా గతేడాది నవంబర్ 24న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ లో హింసాకాండ(Sambhal Violence) చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం జ్యుడిషియల్ ప్యానల్‌ను విచారణకు నియమించింది. అయితే ఈ హింసాకాండ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తున్న షాహి జామా మసీదు కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలిని పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు.

స్థానిక పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం ఇంతకుముందు కూడా ఆయన సాక్ష్యాన్ని నమోదు చేసేందుకు కస్టడీలోకి తీసుకుందని అధికారులు తెలిపారు. అయితే, మార్చి 24న త్రిసభ్య జ్యుడిషియల్ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా అడ్డుకునేందుకే జాఫర్ అలీని అరెస్టు చేసినట్టు ఆయన సోదరుడు తాహిర్ అలీ ఆరోపించారు. హింసాకాండ ఘటనలో జాఫర్ అలీని అరెస్టు చేసినట్టు సంభాల్ పోలీసు సూపరింటెండెంట్ ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

Sambhal Violence Update

సోమవారంనాడు జ్యుడిషియల్ ప్యానల్ ముందు జఫర్ అలి హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉందని, అలా జరక్కుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఆయనను ముందస్తుగా అరెస్టు చేశారని తాహిర్ అలీ ఆరోపించారు. ఉదయం 11.15 గంటలకు విచారణ అధికారి తమ ఇంటికి వచ్చారని, సర్కిల్ అధికారి కులదీప్ సింగ్ మాట్లాడాలనుకుంటున్నారని తమతో చెప్పారని అన్నారు. సర్కిల్ ఆఫీసర్ గత రాత్రి కూడా తమతో మాట్లాడారని, కమిషన్ విచారణ సోమవారం ఉందనగా ఉద్దేశపూర్వకంగానే జాఫర్ అలీని అరెస్టు చేసి జైలుకు పంపారని వివరించారు. హింసాకాండలో చనిపోయిన వారంతా పోలీసు బుల్లెట్లకే చనిపోయినట్టు జాఫర్ ఇప్పటికే మీడియా ముందు చెప్పారని, ఆ మాటను ఆయన ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తాహిర్ అలీ తెలిపారు. జాఫర్‌ను కస్టడీలోకి తీసుకునేటప్పుడు ఆయన ఏమైనా చెప్పారా అని మీడియా ప్రశ్నించగా, తాను సత్యమే చెబుతానని, అందుకోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తన సోదరుడు చెప్పినట్టు తాహిర్ అలీ సమాధానమిచ్చారు.

Also Read : Anna Canteen: అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన డాక్టర్‌ శాంతారావు

Leave A Reply

Your Email Id will not be published!