Samvidhaan Hatya Diwas: రాజ్యాంగ హత్యా దినంగా జూన్ 25 ను ప్రకటించిన కేంద్రం !
రాజ్యాంగ హత్యా దినంగా జూన్ 25 ను ప్రకటించిన కేంద్రం !
Samvidhaan Hatya Diwas: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దాదాపు 50ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీని విధించిన జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినంగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమెర్జెన్సీను విధించారు. దీనితో ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని కూడా అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం’’ అని అమిత్ షా(Amit Shah) తన ఎక్స్ లో రాసుకొచ్చారు.
Samvidhaan Hatya Diwas – ఆ చీకటి రోజులను గుర్తుచేస్తుంది – మోదీ
కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
రాష్ట్రపతి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. అది సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే.
ఆమెను తొలగించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పిలుపునిచ్చారు. విపక్ష నేతలైన జేపీ, ఆద్వానీ, వాజ్‌పేయీ, మొరార్జీ దేశాయ్ సహా అనేకమందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. పత్రికాస్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ… ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
Also Read : Deputy CM Bhatti : ఒడిశా సీఎంతో భేటీ అయిన తెలంగాణ డిప్యూటీ సీఎం