SC ST Atrocity Case: తెలంగాణాలో ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై అట్రాసిటీ కేసు
తెలంగాణాలో ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై అట్రాసిటీ కేసు
SC ST Atrocity : కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(SC ST Atrocity) కేసు నమోదు అయ్యింది. గొల్లగోడెంకు చెందిన బొత్తుల మహేందర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే క్రమంలో పోలీసులు చితకబాదారు. దీనితో మహేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మహేందర్ ను పోలీసులు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్, డీజీపీ, ఎస్పీలకు బాధితుడు మహేందర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు తిప్పారావు, సంపత్ కూడా పలువురికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ట్రైనీ ఎస్సై భార్గవ్‌ను అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.
SC ST Atrocity Case in Telangana
కాగా… బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లయింది. భార్గవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గత నెల (మే) 8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో బాధితుడు మహేందర్ శంకరంపట్నం నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నేపథ్యంలో మహేందర్ వాహనాన్ని ఎస్సై ఆపాడు. ఇంతలో మహేందర్ కు ఫోన్ రావడంతో మాట్లాడుతుండగా… ఎస్సై రెచ్చిపోయాడు. తన ముందే ఫోన్ మాట్లాడుతావా అంటూ బాధితుడిపై చేయి చేసుకున్నాడు. మహేందర్ పై ఎస్సై దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి.
ట్రైనీ ఎస్సై దాడిలో బాధితుడు మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి చెవికి, తలకు గాయాలయ్యాయి. దీనితో ఆస్పత్రిలో కొద్దిరోజుల పాటు చికిత్స పొందాడు. ఈ ఘటనపై ట్రైనీ ఎస్సై సహా ఇతర సిబ్బందిపై డీజీపీకి, కరీంనగర్(Karimnagar) ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మానవహక్కుల సంఘం నేతల దృష్టికి తీసుకెళ్లాడు. దీనితో వారితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా బాధితుడికి అండగా నిలిచి పోరాడారు. వారి పోరాటం ఫలించి ట్రైనీ ఎస్సై భార్గవ్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎస్సై, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
Also Read : MLA Raja Singh: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్