Seven MPs: పాక్‌ తో భారత్ దౌత్య యుద్ధం ! ఏడుగురు ఎంపీలతో విదేశాలకు బ్రీఫింగ్‌ !

పాక్‌ తో భారత్ దౌత్య యుద్ధం ! ఏడుగురు ఎంపీలతో విదేశాలకు బ్రీఫింగ్‌ !

Seven MPs : ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన భారత్… ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు సిద్ధమౌతోంది. దీనిలో భాగంగా పాక్‌ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్‌(Congress) నుంచి సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌(Shashi Tharoor) ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ ఏడు అఖిలపక్ష బృందాలు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.

అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్‌(Shashi Tharoor) (కాంగ్రెస్‌), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్‌ ప్రసాద్‌(బీజేపీ), బైజయంత్‌ పాండా (బీజేపీ) సంజయ్‌ కుమార్‌ ఝా(జేడీయూ), శ్రీకాంత్‌ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా… మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని… ఆపరేషన్‌ సిందూర్‌ తో ఉగ్రవాదంపై భారత్‌ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్‌(Pakistan) అనుసరిస్తున్న పాత్రను… దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌ పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి కారణమైన పాక్‌ రెచ్చగొట్టే చర్యలు, పాక్‌ బెదిరింపులకు ధీటుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. ఈ బృందాలు ముఖ్యంగా ఐదు అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.

Seven MPs – భారత్ అఖిలపక్ష దౌత్య బృందాలు వివరించే అంశాలు ఇవే

1. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలు

2. పాక్‌ బెదిరింపులకు ధీటుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ

3. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత

4. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని స్పష్టతనివ్వడం

5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ..ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్‌ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించడం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌.. పాక్‌(Pakistan)పై అనేక దౌత్య చర్యలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం రద్దు, పాక్‌ పౌరులను తిరిగి స్వదేశానికి పంపడం, వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవడం వంటి చర్యలు చేపట్టింది. అనంతరం ‘‘ఆపరేషన్‌ సిందూర్’’ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్రం విదేశాల రాయబారులు, మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్‌ ఇచ్చింది.

కాంగ్రెస్‌ పంపిన లిస్టులో లేని శశిథరూర్‌ పేరు ! అయినా అతనికి చోటు !

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్‌ హుస్సేన్‌, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్‌ గొగొయ్‌ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్‌ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.

మరోవైపు, శశిథరూర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ… ‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్‌’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Also Read : Tiranga Rally: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ ! ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, పురందేశ్వరి !

Leave A Reply

Your Email Id will not be published!