CM Rekha Gupta: దిల్లీ సీఎంపై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
దిల్లీ సీఎంపై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
CM Rekha Gupta : దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో ‘జన్ సున్‌వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఆమెపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు రాజ్ నివాస్ మార్గ్‌లోని ఆమె అధికారిక నివాసంలో భద్రతా లోపాలను గుర్తించారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఆటో డ్రైవర్ సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్(41)గా గుర్తించి ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు… భద్రతా లోపాల కారణంగా ‘పెను ప్రమాదం’ సంభవించే అవకాశాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హోం మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ దాడి తర్వాత సీఎం రేఖా గుప్తాకు (CM Rekha Gupta) కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఇందులో 20-22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెకు భద్రతకు కల్పిస్తారని అధికారులు ‘ఈటీవీ భారత్’కు తెలిపారు. నిరంతరం ఆమెకు రక్షణ కల్పించడానికి అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.
CM Rekha Gupta – కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి, రావడానికీ ఒక్కటే గేటు ?
రెండు నెలల కిందట, సీఎం రేఖాగుప్తాకు (CM Rekha Gupta) 1/8 , 2/8 రాజ్ నివాస్ మార్గ్‌లో రెండు బంగ్లాలు కేటాయించారు. అందులో ఆమె ఒకదాన్ని తన నివాసంగా, మరొకటి క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో మరో రెండు బంగ్లాలు కూడా ఉన్నాయి. వాటిని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రవి ఇంద్రరాజ్ సింగ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్‌లకు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. నాలుగు బంగ్లాలకు ప్రవేశించడానికి, బయటకు వెళ్లేందుకు మార్గం ఒక్కటే ఉండటం ప్రధాన భద్రతా లోపం అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నివేదికలో వెలుగులోకి వచ్చిన మరో లోపం ఏమిటంటే.. సిబ్బంది, అక్కడికి వచ్చే సందర్శకులు ఒకే మార్గాన్ని ఉపయోగించడం. దీనితో ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించడం కష్టంగా మారిందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ గోయల్ దీనిపై స్పందించారు. నిర్మాణ సంబంధిత సమస్యలను కూడా ఎత్తి చూపారు. కాంప్లెక్స్ ప్రహారీ గోడ ఎత్తు చాలా తక్కువగా ఉందన్నారు. ఎవరైనా సులభంగా లోపలికి దూకే విధంగా ఉందని తెలిపారు. ‘‘కాంప్లెక్స్‌కు మూడు వైపులా ప్రైవేట్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. భద్రతా సిబ్బంది నిరంతరం నిఘా నిర్వహించడం కష్టతరంగా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని రాష్ట్రల మాదిరిగా దిల్లీ ముఖ్యమంత్రికి శాశ్వత నివాసం లేదన్నారు. రేఖా గుప్తా (CM Rekha Gupta) బంగ్లా టైప్-7 అని, సాధారణంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేటాయించే టైప్-8 ఇళ్ల కంటే కాస్త చిన్నదిగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read : Rahul Gandhi: తన పెళ్లిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశక్తికర వ్యాఖ్యలు
