Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య – అమెరికాలో శశిథరూర్ బృందం
ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య - అమెరికాలో శశిథరూర్ బృందం
ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్యఅని… దీనిపై అన్ని దేశాలు ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పిలుపునిచ్చారు. ఉగ్ర దాడులపై భారత్ మౌనంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు శశిథరూర్ నాయకత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. ఈక్రమంలోనే న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్యన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఆయన భారత కాన్సులేట్‌లో వివరించారు. ‘‘పహల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడితో భారత్ లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది వారి ప్రయత్నంగా తెలుస్తోంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. లష్కరే తయ్యిబాకు అనుబంధ సంస్థ ఇది. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ ఇప్పటికే ఐరాసను అభ్యర్థించింది. నేను ప్రభుత్వంలో కాకుండా… ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. ఈ దాడి తర్వాత పాక్‌పై తీసుకోవాల్సిన అంశాలను ఉద్దేశిస్తూ నేను ఒక వ్యాసం రాశాను. భారత బలగాలు పాక్‌ను బలంగా, తెలివితో దెబ్బతీశాయి.
పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత బలగాలు కచ్చితమైన దాడులు చేసి… వాటిని నేలమట్టం చేశాయి. మేము ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే… పాక్ సైన్యం స్పందించింది. మాపై ప్రతిదాడులకు దిగింది. వాటిని సమర్థమంతంగా తిప్పికొట్టాం. ఈ ఆపరేషన్‌తో ఉగ్రచర్యలను భారత్ సహించదనే గట్టి సందేశం ఇచ్చింది. ఇది పహల్గాం దాడికి ప్రతిస్పందన మాత్రమే తప్ప.. పాక్‌తో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం కాదు. దాన్ని మేము కోరుకోవడం లేదు. దేశ ప్రజల రక్షణే మాకు ముఖ్యం’’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు అండగా నిలుస్తామన్న జపాన్, రష్యా
ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రష్యా, జపాన్ విస్పష్టమైన హామీ ఇచ్చాయి. జపాన్‌లోని రాజకీయ నాయకత్వం, విధాన నిర్ణేతలు, మీడియా, ప్రవాస భారతీయ వర్గం మన దేశానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. ప్రపంచ వేదికలపై పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు, ఉగ్రవాదంపై పోరాటానికి అన్ని దేశాల మద్దతు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాల జపాన్, రష్యా పర్యటనలు శనివారం ముగిశాయి. రెండు దేశాల్లో పలు వర్గాలతో ప్రతినిధుల బృందాలు చర్చలు జరిపి మద్దతు పొందాయి. రష్యాకు వెళ్లిన బృందానికి డీఎంకే ఎంపీ కనిమొళి నాయకత్వం వహిస్తుండగా… జపాన్ వెళ్లిన బృందానికి జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు కనిమొళి బృందం రష్యా నుంచి స్లోవేనియాకు వెళ్లింది. ప్రవాస భారతీయ కుటుంబాలతో టోక్యోలోని రాయబార కార్యాలయంలో భారత బృందం భేటీ అయింది. ఉగ్రవాదం పిచ్చి కుక్కలాంటిదని, దానికి పాకిస్థాన్ ప్రోత్సాహం అందిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ సందర్భంగా విమర్శించారు. భారత్ దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ సైనికాధికారులు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
బీజేపీ సీనియర్ నేత బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం శనివారం బహ్రెయిన్ చేరుకుంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ఖతార్, దక్షిణాఫ్రికా, ఇథియోపియా, ఈజిప్టులకు వెళ్లే భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆమె శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ బృందంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.