Shashi Tharoor: ట్రంప్ ఒత్తిడికి భారత్ లొంగకూడదు – శశిథరూర్
ట్రంప్ ఒత్తిడికి భారత్ లొంగకూడదు - శశిథరూర్
Shashi Tharoor : భారత దిగుమతులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటన సరికాదన్నారు. గురువారం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Shashi Tharoor Strong Counter to Trump
‘భారత వాణిజ్యానికి అమెరికా అతి పెద్ద మార్కెట్. మన ఎగుమతులే 87-90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయి. రష్యా నుంచి దిగుమతులు చేస్తున్నందుకు సుంకాలు, జరిమానా విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసం ఇది హెచ్చరిక కావొచ్చు. టారీఫ్‌ల నేపథ్యంలో ఎగుమతులు తగ్గితే అది మనకు నష్టం కలుగుతుంది. ఇది మన జీడీపీపై కూడా ప్రభావం చూపించొచ్చు. అమెరికా డిమాండ్లు పూర్తిగా అర్థం లేనివిగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించే హక్కు భారత్‌కు ఉంది. వారిని సంతోషపెట్టడానికి మన జీవనోపాధిని పణంగా పెట్టలేం. మన అవసరాలను కూడా అగ్రరాజ్యం అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ టారిఫ్‌ల విషయంలో మన దేశ విధానంపై నమ్మకం ఉందని థరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. తర్వాత ఎం జరుగుతుందనేది కొనసాగుతున్న చర్చలపై ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా ఒత్తిడికి లొంగిపోకుండా.. న్యూదిల్లీ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
దేశ ప్రయోజనాలే ముఖ్యం – ట్రంప్ టారిఫ్ ప్రకటనపై పియూష్ గోయల్
దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై.. లోక్‌సభలో పీయూష్ గోయల్ మాట్లాడారు. ఈ టారిఫ్ ప్రభావాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. “భారత ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా రెండు దేశాలు సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులు, చిన్న వ్యాపారులు, ఎంఎంఈలు వంటి వర్గాల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తోందని గోయల్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంతన్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.
‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్‌తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’’అంటూ ఆక్షేపించారు.
Also Read : Kerala Government: మందుబాబులకు కేరళ సర్కార్ బంపర్ ఆఫర్
