Ship Accident: కొచ్చి తీరంలో మునిగిన లైబీరియా నౌక ! భారీస్థాయిలో లీకైన చమురు !

కొచ్చి తీరంలో మునిగిన లైబీరియా నౌక ! భారీస్థాయిలో లీకైన చమురు !

Ship Accident : కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక(Ship Accident) ఆదివారం పూర్తిగా నీట మునిగిపోయింది. ఆందోళనకరమైన విషయమేంటంటే నౌకలోని 640 ఇంధన కంటెయినర్లూ సముద్ర జలాల్లో పడిపోయాయి. వాటి నుంచి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీకైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. సముద్రంలోకి వెళ్లొద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా జాలర్లను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. చమురు తెట్టును కట్టడి చేయడానికి నౌకాదళం, భారత తీరరక్షక దళం(ఐసీజీ) తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేరళలోని విఝింజమ్‌ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన ఈ లైబీరియా(Liberia) నౌక (ఎంఎస్‌సీ ఎల్సా-3) కొచ్చిన్‌ కు చేరుకొనే క్రమంలో శనివారం 26 డిగ్రీల మేర ఒరిగి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నౌకలోని 24 మంది సిబ్బందిని ఐసీజీ రక్షించింది. లీకైన చమురు తెట్టు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోందని అధికారులు తెలిపారు.

కేరళలోని(Kerala) కొచ్చి తీరంలో లైబీరియాకు చెందిన ఎమ్‌ఎస్‌సీ ఈఎల్‌ఎస్‌ఏ 3 శనివారం సాయంత్రం వంగిపోవడంతో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్‌ 24 మంది సిబ్బందిని రక్షించింది. 24 మంది సిబ్బందిలో ఒక రష్యన్‌ (ది మాస్టర్‌), 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియన్‌ జాతీయుడు ఉన్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి ముగ్గురు సీనియర్‌ సిబ్బంది ఓడలోనే ఉండిపోయారు. అయితే.. ఆదివారం తెల్లవారుజాము సమయానికి అది పూర్తిగా బోల్తా పడటంతో ఇండియన్‌ నేవీ షిప్‌ ఐఎన్‌ సుజాత ఆ ముగ్గురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. నౌకలో భారీగా రసాయనాలు ఉన్నాయని, అవి సముద్రంలో లీకై, వేగంగా విస్తరిస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.

Ship Accident – కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు

నౌకలోని 13 కంటెయినర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్‌ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్‌ టన్నుల ఫర్నేస్‌ ఆయిల్‌ ఉన్నాయి. దీనితో కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలీన్‌ వాయువును తయారుచేస్తుంది. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మ్యాపింగ్‌ సాంకేతికతతో చమురు లీకేజీని అంచనా వేస్తున్నారు. లీక్‌ అయిన ఇంధనం గంటకు దాదాపు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని గుర్తించింది. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కావడంతో… చమురును విచ్ఛిన్నం చేయడానికి వైమానిక డోర్నియర్‌ విమానాలు డిస్పర్సెంట్‌ను స్ప్రే చేస్తున్నాయి.

కేఎస్‌డీఎంఏ హెచ్చరికలు

కేరళలోని సముద్ర తీరం జీవవైవిధ్యానికి నిలయం. పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ. ఈ రెండింటికి ఎలాంటి విఘాతం కలగకుండా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) చర్యలు తీసుకుంటోంది. కంటైనర్లు చమురుతో సహా సరుకు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో చమురు పొరలు కనిపించవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒడ్డుకు కొట్టుకువచ్చే కార్గో కంటైనర్లు లేదా చమురును తాకవద్దని సూచించింది. ఒడ్డున కంటైనర్లు లేదా చమురు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రకటించింది.

Also Read : Lalu Prasad Yadav: కొడుకు తేజ్‌ప్రతాప్‌ ను పార్టీ నుంచి, కుటుంబం నుండి బహిష్కరించిన లాలూ

Leave A Reply

Your Email Id will not be published!