Shubhanshu Shukla: జూన్‌ 19న అంతరిక్ష యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

జూన్‌ 19న అంతరిక్ష యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన కొత్త తేదీ ఖరారైంది. సాంకేతిక సమస్యలతో ఈ రోదసియాత్ర పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త తేదీని ప్రకటించింది. యాక్సియం-4 కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు (Shubhanshu Shukla) జూన్‌ 19న రోదసియాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈనెల 11న ప్రయోగానికి ముందు రాకెట్‌ లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ అవుతున్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో వెల్లడించింది. ఈనేపథ్యంలో కొత్త ప్రయోగ తేదీని ప్రకటించింది.

Shubhanshu Shukla Space Journey

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు… అంతరిక్షం నుండి ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.

Also Read : Bomb Threat: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ! థాయిలాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!