Shubhanshu Shukla: ఐఎస్ఎస్ యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంపిక !
ఐఎస్ఎస్ యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంపిక !
Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను(Shubhanshu Shukla) ఎంపికచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. అనూహ్య పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే.. ప్రత్యామ్నాయ ఏర్పాటు (బ్యాకప్) కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఎంపిక చేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్ఎస్కు తీసుకెళ్లనుంది.
Shubhanshu Shukla…
ఐఎస్ఎస్కు యాక్సియమ్ నిర్వహించబోయే నాలుగో మిషన్ కోసం ఆ సంస్థతో తమ మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వివరించింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ మిషన్ ఎసైన్మెంట్ బోర్డు.. ఇద్దరు ‘గగన్యాత్రీ’ల (వ్యోమగాముల) పేర్లను సిఫార్సు చేసినట్లు వివరించింది. శుక్లా, నాయర్ లకు ఈ వారం నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొంది. ఐఎస్ఎస్లో వీరు.. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తారు. ఆ యాత్రలో వీరు గడించే అనుభవం.. వచ్చే ఏడాది భారత్ చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)కు ఉపయోగపడనుంది. గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా, నాయర్లు ఉన్నారు. వీరితోపాటు గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లు కూడా శిక్షణ పొందుతున్నారు. ఈ నలుగురిలో శుక్లా అత్యంత పిన్న వయస్కుడు (39) కావడం గమనార్హం.
శుక్లాతో(Shubhanshu Shukla)పాటు ఐఎస్ఎస్కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : Minister Satyakumar : నూతన విద్యావిధానంపై మరో అప్డేట్ ఇచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్