Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్ అనుభవాన్ని వెల్లడించిన శుభాంశు శుక్లా
ఐఎస్‌ఎస్ అనుభవాన్ని వెల్లడించిన శుభాంశు శుక్లా
Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన అంతరిక్షంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి తాజాగా వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శుభాంశు శుక్లా (Subhanshu Shukla) మాట్లాడుతూ… ‘‘స్పేస్ మిషన్ ప్రారంభమైన దగ్గరి నుంచి ఎంతో ఉత్సుకత ఉంటుంది. అయితే మనం మైక్రోగ్రావిటీ పరిస్థితులకు చేరుకుంటాం. అవి మన శరీరానికి పూర్తిగా కొత్త. దాంతో అంతా మారిపోతుంది. రక్తప్రసరణలో తేడా వస్తుంది. ముఖం ఉబ్బుతుంది. గుండెవేగం మందగిస్తుంది. మీ వెన్నెముక సాగుతుంది. తరచూ నడుము నొప్పి వస్తుంటుంది. మీ పొట్టలోని పదార్థాలన్నీ తేలినట్టుగా అనిపిస్తాయి. దాంతో ఆకలి అనిపించదు. అంతరిక్షంలోకి వెళ్లిన మరుక్షణం నుంచే ఈ మార్పులన్నీ వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనం శరీరం తిరగబడుతుంది’’ అని శుక్లా వెల్లడించారు.
Shubhanshu Shukla Comments
ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో (Shubhanshu Shukla) ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ సంభాషణకు ముందు తాను క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పారు. అప్పుడు తనకు వికారంగా అనిపించిందని, తలనొప్పితో బాధపడ్డానని చెప్పారు. ‘‘వికారానికి మందులు వేసుకుంటే మగత ఉంటుందని అవి కూడా వేసుకునే వీలు లేకుండా పోయింది’’ అని చెప్పారు.
అప్పుడు తమ బృందం సభ్యులు ఎంతో సహకరించారని చెప్పారు. అక్కడ వ్యోమగాములు ఒకరిపై ఒకరు ఆధారపడాల్సి ఉంటుందని అన్నారు. ఐఎస్‌ఎస్‌లోని పరిస్థితులు మన సహనానికి పరీక్ష పెడతాయని చెప్పారు. అయితే బృంద కృషి, పట్టుదల ఎంతో అవసరం అని అన్నారు. అంతరిక్ష యాత్ర కోసం ఏడాది కాలం అమెరికా శిక్షణ పొందిన శుభాంశు శుక్లా.. జూన్ 25 నుంచి జులై 15 వరకూ ఆయన రోదసీ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read : Assam Rifles: అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై కాల్పులు ! ఇద్దరు జవాన్ల మృతి !
