Simhachalam: సింహాచలం ప్రమాద ఘటనా స్థలంలో త్రీమెన్ కమిటీ విచారణ

సింహాచలం ప్రమాద ఘటనా స్థలంలో త్రీమెన్ కమిటీ విచారణ

Simhachalam : విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ఈ త్రిమెన్ కమిటీ గురువారం ప్రమాద ఘటనను మరోసారి పరిశీలించింది. ఈ సందర్భంగా రీటైనింగ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చింది.

Simhachalam Incident

గురువారం ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన త్రిసభ్య కమిటీ… అక్కడే కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులకు పలు ప్రశ్నలు సంధించింది. గోడ నిర్మాణాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించి… 26 వరకు చేపట్టినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో పాటూ దేవాదాయ అధికారులను విచారించిన మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ పూర్తి వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా క్వాలిటీ నిర్మాణం కాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అంచనాకు వచ్చింది. అయితే టెంపుల్ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుకూలంగా జరిగిందా లేదా అనేది నిర్ధారిస్తామని చెప్పారు. వైఫల్యాలు, లోపాలపై నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. కాంట్రాక్టర్‌ తో పాటు అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు…? ఇందులో వాళ్ల ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశాలపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ… సింహాచలం(Simhachalam) ప్రమాద ఘటనలో విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. మూడు రోజుల్లో ప్రాధమిక నివేదిక ఇస్తాం. నెల రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తాం. సింహాచలం(Simhachalam) ఆలయంలో గోడ ఎందుకు కూలింది కారణాలు ఏమిటి అనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం. నాసిరకంగా కట్టడం వల్ల జరిగిందా? ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నాం. కేవలం ఒక్క వ్యక్తి చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోలేం. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తాం. అందరూ అన్ని వివరాలు చెప్పిన తరువాత మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

ఇక.. గోడ కూలిన ప్రమాద స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈ క్రమంలో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై త్రీమెన్‌ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే వాళ్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఏవీ ఫాలో అయ్యారా….? అనే ప్రశ్నలకు అధికారులు తడబడ్డారు. ప్రసాదం స్కీం పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సి ఫార్సులు ఏమయ్యాయన్న ప్రశ్నకు వాళ్ల దగ్గరి నుంచి సరైన సమాధానాలు రాలేదు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read : Golkonda Bonalu: గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్ ! ఎప్పటి నుండి అంటే ?

Leave A Reply

Your Email Id will not be published!