Odisha Hospital: సూదిమందు వికటించి ఒడిశాలో ఆరుగురు మృతి

సూదిమందు వికటించి ఒడిశాలో ఆరుగురు మృతి

Odisha Hospital : ఒడిశాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు గంటల వ్యవధిలో ఆకస్మికంగా మృతి చెందిన ఘటన కలకలం రేకెత్తించింది. కొరాపుట్‌ జిల్లాలో షహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. దీనితో సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్‌ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య కళాశాల డీన్‌ సుశాంత్‌ సాహు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Odisha Hospital Incident

ఒడిశాలోని(Odisha) కలహండి, సిమిలిగుడ, బొరిగుమ్మ, కొరాపుట్‌ ప్రాంతాలకు చెందిన రుక్మిణి పెల్టియా(40), సుక్రమాఝి(45), పులోమతి మాఝి(40), భగవాన్‌ పారిజ(55), బటి ఖొరా (45) రెండు రోజులుగా కొరాపుట్‌ లోని సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. మంగళవారం వీరికి శస్త్రచికిత్సలు జరిగాయి. అనంతరం అత్యవసర వార్డుకు తరలించారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ నర్సు వీరికి రెండేసి చొప్పున ఇంజెక్షన్లు చేశారు. ఆ తర్వాత కొంత సమయానికే వారి పరిస్థితి విషమించి ఐదుగురు మృతి చెందగా, బుధవారం జయపురం ప్రాంతానికి చెందిన జగన్నాథ్‌ పూజారి అనే రోగి మృతి చెందారు. ఆపరేషన్‌ తరువాత కూడా తమ వారు ఆరోగ్యంగానే ఉన్నారని కానీ ఓ నర్సు వచ్చి ఇంజెక్షన్‌ ఇచ్చిన తరువాతే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న వైద్య కళాశాల డీన్‌ సుశాంత్‌ సాహు చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

దీనిపై కలెక్టర్‌ కీర్తివాసన్‌ మీడియాతో మాట్లాడుతూ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కళాశాల డీన్‌ సుశాంత్‌ మాట్లాడుతూ సరైన మందులే ఇచ్చామన్నారు. మృతిచెందిన వారందరూ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత విషయం తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ సీఎల్పీ నేత, పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం, ఇతర పార్టీల నేతలు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసినట్లు కొరాపుట్‌ ఠాణా పోలీసు అధికారి సత్యానంద్‌ తెలిపారు. మరోవైపు ఒడిశా(Odisha) ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Also Read : Australia: సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ పోరుకు ఆస్ట్రేలియా మద్దత్తు

Leave A Reply

Your Email Id will not be published!