సామ‌జిక భ‌ద్ర‌త మ‌హిళా సాధికార‌త

అన్నాడీఎంకే పార్టీ మేనిఫెస్టో విడుద‌ల

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల వేళ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది అన్నాడీఎంకే. అన్ని పార్టీల కంటే ముందే మేలుకొంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా త‌మ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త సీఎం అన్నా ఎంజీఆర్ 109వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అన్నాడీఎంకే పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్య‌మంత్రి ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చెన్నైలో ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పార్టీ ప‌రంగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుదల చేయ‌డం విస్తు పోయేలా చేసింది. అంతే కాకుండా పురుషులు, మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా సిటీ బ‌స్సుల‌లో మ‌హిళ‌ల‌తో పాటు పురుషుల‌కు కూడా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌న్నారు.

త‌మ పార్టీ సంక్షేమం కోసం పాటు ప‌డుతుంద‌న్నారు ప‌ళ‌ని స్వామి. ఈ వాగ్దానాలు ప్రజలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఏఐఏడీఎంకే పాలన వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయ‌ని చెప్పారు. మహిళలను సాధికారత కల్పించడం, జీవనోపాధిని బలోపేతం చేయడం, అందరికీ గృహ వసతి కల్పించడంతో సామాజిక భ‌ద్ర‌తకు ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు . రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ నెల‌కు కుటుంబ పెద్ద‌కు రూ. 2000 ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌ళ‌ని స్వామి. ప్ర‌స్తుతం ఉన్న రూ. 1000కి అద‌నంగా ఇస్తామ‌ని, నేరుగా వారి ఖాతాల్లోకి జ‌మ చేస్తామ‌న్నారు. అమ్మ ఇల్లం ప‌థ‌కం కింద సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఇల్లు లేని ప్ర‌తి ఒక్క‌రికీ ఇల్లు క‌ట్టించి ఇస్తామ‌ని అన్నారు. తాజాగా చేసిన ఈ హామీలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ప్ర‌భావితం చేసేలా ఉన్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!