తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కు అంతా ఊహించినట్టుగానే ప్రభుత్వం కీలక పోస్టు కేటాయించింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ప్రధాన సలహాదారుగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ పదవిలో సోమేశ్ కుమార్ ఏకంగా మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
ప్రధాన సలహాదరుగా ఆయనకు కేబినెట్ హోదా కల్పించడం విశేషం. ఇదిలా ఉండగా సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ . ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ గా ఉన్నారు.
అనంతరం గిరజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా , 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సోమేశ్ కుమార్ పనితీరుకు మెచ్చిన సీఎం కేసీఆర్ 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏపీకి వెళ్లి పోవాల్సిందిగా ఆదేశించింది. అక్కడికి వెళ్లి రిపోర్టు చేశారు. కానీ ఏ పోస్టు కేటాయించ లేదు. దీంతో ఉన్నట్టుండి స్వచ్చంధ పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ సభలో సీఎం పక్కనే సోమేశ్ కుమార్ కనిపించారు.
సోమేశ్ కుమార్ పై విపక్షాలు గత కొన్నేళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చాయి. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పించడం పై భగ్గుమంటున్నాయి.