Sonia Gandhi: ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో సోనియా, రాహుల్‌ లపై ఈడీ ఛార్జిషీట్‌

‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో సోనియా, రాహుల్‌ లపై ఈడీ ఛార్జిషీట్‌

Sonia Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జ్ షీటు నమోదు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌(National Herald) కేసులో సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీలు… కారుచౌకగా షేర్లు బదలాయించుకుని కోట్ల రూపాయల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది. 988 కోట్ల రూపాయల మేర అక్రమ నగదు చలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జిషీటు రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. ఈ కేసులో సోనియాను మొదటి నిందితురాలి (ఏ-1)గా, రాహుల్‌ ను ఏ-2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీనిని పరిశీలించి, తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు.

Sonia Gandhi got National Herald Case

కాంగ్రెస్‌ నేతలు శాం పిట్రోడా, సుమన్‌ దుబె తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. ‘నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం’ (పీఎంఎల్‌ఏ) లోని సెక్షన్‌ 3, 4 కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.కె.మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్‌ కాపీ రూపంలో అందించాలని ‘ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టు’ న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై ఛార్జిషీటు దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమమని చెబుతున్నారు.

హరియాణాలో స్థిరాస్తి ఒప్పందంతో ముడిపడిన మనీలాండరింగ్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాను ఈడీ ప్రశ్నించిన రోజే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సోనియా, రాహుల్‌ లతో ముడిపడి ఉన్న రూ. 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ(ED) ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరు ఎంపీలు కావడంతో… మోసం, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలకు సంబంధించి జిల్లా కోర్టులో ఉన్న కేసును ఈ కోర్టుకు మార్పించి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.

అసలు ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసు ఏమిటంటే ?

‘నేషనల్‌ హెరాల్డ్‌’ ప్రచురణకర్త ‘అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌’ (ఏజేఎల్‌)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకుని… రూ.రెండు వేల కోట్ల విలువచేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన కైవసం చేసుకున్నారంటూ కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2014 జూన్‌ 26న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దానిలో సోనియా, రాహుల్, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, దుబే, పిట్రోడా తదితరుల నేరపూరిత కుట్ర ఉందని ఆరోపించారు. వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సవాళ్లు ఎదురైనా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రం దర్యాప్తునకు మార్గం సుగమం చేశాయి. 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది.

యంగ్‌ ఇండియన్‌ లో సోనియా, రాహుల్‌లకు చెరో 38% వాటాలు ఉన్నాయి. మోసపూరితంగా ఈ కంపెనీలోకి ఆస్తుల్ని బదలాయించారనేది ఆరోపణ. కేసులో యంగ్‌ ఇండియన్, డొటెక్స్‌ మెర్చండైజ్‌ ప్రై.లి. సంస్థల్ని, సునీల్‌ భండారీని నిందితులుగా చేర్చింది. సోనియా, రాహుల్‌ లను ‘‘యాజమాన్య లబ్ధిదారులు’’ గా పేర్కొంది. యంగ్‌ ఇండియన్, ఏజేఎల్‌లను ఉపయోగించుకుని రూ.18 కోట్ల బోగస్‌ విరాళాలు, రూ.38 కోట్ల బోగస్‌ అద్దెలు, రూ.29 కోట్ల బోగస్‌ ప్రకటనలు రాబట్టుకున్నారని ఈడీ ఆరోపించింది. కేసుతో ముడిపడిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తార్కాణం – కాంగ్రెస్‌

సోనియా, రాహుల్‌ల పేర్లను ఛార్జిషీటులో చేర్చడం ముమ్మాటికీ ప్రతీకారమేనని కాంగ్రెస్‌(Congress) మండిపడింది. ఆస్తుల్ని జప్తు చేయడం ‘‘చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరం’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ నాయకత్వం దీనిని మౌనంగా చూస్తూ ఊరుకోజాలదన్నారు. ఎలాంటి డబ్బు, ఆస్తుల బదలాయింపు జరగకుండా మనీలాండరింగ్‌ విచారణ చేపట్టడం విడ్డూరంగా ఉందని పార్టీ సీనియర్‌నేత అభిషేక్‌ మనుసింఘ్వి చెప్పారు. దీనిని తాము పూర్తిస్థాయిలో సవాల్‌ చేస్తామన్నారు.

ప్రభుత్వంపై రాహుల్‌ పోరాడుతున్నందువల్లే తప్పుడు కేసులతోనైనా ఆయన నోరు నొక్కేయాలని చూస్తున్నారని సీనియర్‌ నేత మాణికం ఠాగూర్‌ అన్నారు. బుధవారం రాష్ట్రాల రాజధానుల్లో ఈడీ కార్యాలయాల ఎదుట, జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ తెలిపారు. పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. విపక్ష నేతలపై అవినీతి బురదజల్లి అరెస్టు చేయించే ప్రతీకార రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందని రాజ్యసభ సభ్యుడు కపిల్‌సిబల్‌ అన్నారు.

దోచుకున్నవారు తిరిగి చెల్లించాల్సిందే – బీజేపీ

ఈడీ ఛార్జిషీటుపై బీజేపీ(BJP) స్పందిస్తూ- కాంగ్రెస్‌ అవినీతికి ఇదో సజీవ తార్కాణమని పేర్కొంది. నెహ్రూ-గాంధీ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత అవినీతికి పాల్పడిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ ఆరోపించారు. అవినీతికి పాల్పడినవారు, ప్రజల ఆస్తుల్ని దోచుకున్నవారు దానిని తిరిగి చెల్లించాల్సిందేనన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారు తమను తాము బాధితులుగా చూపించుకునే ప్రయత్నం చేశారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శించారు. కోర్టు ఆదేశాల మేరకే విచారణ మొదలైందని, దానిని ప్రతీకార చర్య అంటారా అని ప్రశ్నించారు.

Also Read : Air Hostess: ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎయిర్‌ హోస్టేస్‌ పై అత్యాచారం

Leave A Reply

Your Email Id will not be published!