Sonia Gandhi: ఓటర్ ఐడీ వివాదం కేసులో సోనియాగాంధీకి ఊరట
ఓటర్ ఐడీ వివాదం కేసులో సోనియాగాంధీకి ఊరట
Sonia Gandhi : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి దిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే 1980లో ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపిస్తూ నమోదైన కేసులో క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీనితో సోనియాగాంధీకు భారీ ఊరట లభించినట్లయింది.
Sonia Gandhi – అసలు ఈ కేసు ఏంటంటే ?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే 1980లో ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఆ వ్యవహరంలో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 1983లో సోనియాకు భారత పౌరసత్వం వచ్చింది. 1980 నాటి ఓటర్ జాబితా అంటూ గత నెల భాజపా నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. గాంధీ కుటుంబ సభ్యులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీతో పాటు సోనియా పేరును చేర్చారని పేర్కొన్నారు.
అప్పటికీ ఆమె ఇంకా ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నారని రాసుకొచ్చారు. అయితే దానిపై విమర్శలు రావడంతో 1982లో ఓటర్ జాబితా నుంచి ఆమె పేరు తొలగించారని, 1983లో మళ్లీ కనిపించిందని వెల్లడించారు. అప్పుడు కూడా పౌరసత్వం రావడానికన్నా ముందే మళ్లీ జాబితాలోకి పేరు వచ్చి చేరిందని విమర్శించారు. ‘‘రాజీవ్‌ను వివాహమాడిన తర్వాత పౌరసత్వం రావడానికి 15 ఏళ్లు ఎందుకు పట్టిందని ఇక్కడ ప్రశ్నించడం లేదు. ముందే ఓటర్ జాబితాలో ఆమె పేరు కనిపించడం ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగం కాకపోతే ఇంకేంటి..?’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఎన్నికల సంఘం చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఓట్లు చోరీ చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతమైందని ఆయన ఆరోపించారు. ఈ విమర్శల వేళ సోనియా గాంధీ పౌరసత్వం, ఓటర్ జాబితాలో ఆమె పేరు చేరిన సమయాన్ని బీజేపీ ఎత్తి చూపింది.
Sonia Gandhi – రాహుల్ భద్రతపై సీఆర్పీఎఫ్ లేఖ
కాంగ్రెస్ అగ్రనేత, రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) భద్రతాపరమైన ప్రొటోకాల్ పాటించడం లేదని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆరోపించింది. విదేశీ పర్యటనల వేళ ఆ నియమావళిని ఉల్లంఘించారంటూ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు హస్తంపార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌కు సీఆర్‌పీఎఫ్ లేఖ రాసింది.
‘‘రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తనకు అందిస్తోన్న భద్రతను సీరియస్‌గా తీసుకోలేదు. ఎక్కువ సందర్భాల్లో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశాలకు వెళ్తున్నారు’’ అని సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ ఆ లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఇటలీ, మార్చిలో వియత్నాం, ఏప్రిల్‌లో దుబాయ్, జూన్‌లో ఖతార్, లండన్, సెప్టెంబర్‌లో మలేషియా పర్యటనకు రాహుల్ వెళ్లారని ప్రస్తావించారు. సీఆర్‌పీఎఫ్ ఎల్లో బుక్ నియమావళిని పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, ఖర్గే, రాహుల్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందనా రాలేదు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లీజాన్ (ASL) కలిగిన జెడ్+ సెక్యూరిటీ కవర్ కింద రక్షణ పొందుతున్నారు. తీవ్రముప్పు పొంచి ఉన్న వారికి ప్రభుత్వం ఈ స్థాయి భద్రతను కల్పిస్తుంటుంది. దీనికింద రాహుల్‌కు 55 మంది రక్షణగా ఉంటారు. వారిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు కూడా ఉంటారు. ఈ ఏఎస్‌ఎల్ కింద.. భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ యూనిట్లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తారు. సదరు వీఐపీ పర్యటించే ప్రాంతం వద్ద ముందస్తు నిఘా ఉంచుతారు.
ఇక, రాహుల్ కు సీఆర్పీఎఫ్ ఇలా లేఖరాయడం ఇదే తొలిసారికాదు. 2020 నుంచి 113 సందర్భాల్లో భద్రతా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని 2022లో లేఖరాసింది. మరోవైపు, 2023లో భారత్ జోడో యాత్రలో భాగంగా పలు భద్రతా వైఫల్యాలు వెలుగుచూశాయని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. గత నెల ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా దూసుకొచ్చి.. రాహుల్‌ను ఆలింగనం చేసుకోవడం ఆందోళన కలిగించింది. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకకు మూడు దశాబ్దాలుగా అందిస్తోన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) రక్షణను 2019లో కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ తర్వాత నుంచి సీఆర్పీఎఫ్ ఆ బాధ్యతలు చూస్తోంది.
Also Read : C P Radhakrishnan: గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా
