Southwest Monsoon: కేరళను తాకిన ‘నైరుతి’ ! 16 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి త్వరగా రుతుపవనాలు !
కేరళను తాకిన ‘నైరుతి’ ! 16 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి త్వరగా రుతుపవనాలు !
Southwest Monsoon : ఖరీఫ్ సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశముంది. వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను(Kerala) తాకాయి. గతేడాది మే 30న రాగా… 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకు(Kerala) వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం. దేశ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వర్షాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో 2025 నాటికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది. ముందస్తు వర్షాలు వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, నూనెగింజల విత్తనాలను పెంచుతాయని రబీ సీజన్‌కు ముందు జలాశయాల నీటి మట్టాన్ని పెంచుతాయని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.
Southwest Monsoon : అరేబియా సముద్రంపై అల్పపీడనం
మరోవైపు, అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదలుతోంది. మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read : CM Chandrababu : డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఏపీ ఆదర్శం