Wing Commander Vyomika Singh: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vyomika Singh : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాటు తదనంతరం నిర్వహించిన మీడియా సమావేశాల్లో కీలకంగా వ్యవహరించిన వింగ్ కమాండర్(Wing Commander) వ్యోమికా సింగ్ పై ఉత్త‌ర ప్ర‌దేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్‌ యాదవ్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ… ‘వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్(Vyomika Singh) రాజ్‌పుత్ కాబ‌ట్టే ఆమెను వ‌దిలేసి… ముస్లిం మతానికి చెందిన క‌ల్న‌ల్ సోఫియా ఖురేషీ గురించి విజ‌య్ షా మాట్లాడారని రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. దీనితో వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ కులాన్ని వెల్లడిస్తూ రామ్ గోపాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మోరాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాద‌వ్ పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మంలో మంత్రి విజ‌య్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించారు. ‘ఓ మంత్రి క‌ల్న‌ల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మ‌త‌త‌త్వ వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్ల‌ని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ సంద‌ర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్ష‌ల్ ఏకే భార‌తి కులాల ప్రస్తావనకు తెచ్చారు. వ్యోమికా సింగ్(Vyomika Singh) బలహీన వర్గానికి చెందిన జాథవ్‌ కులంలో పుట్టిన మహిళ అని రాంగోపాల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌ తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు.

Vyomika Singh – రామ్‌ గోపాల్‌ యాదవ్ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం

రామ్‌ గోపాల్‌ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు కాదని అన్నారు. ప్రతి సైనికుడు దేశధర్మం పాటిస్తారని, వారు ఏ కులానికిగానీ, మతానికిగానీ ప్రతినిధులు కారని, ఆర్మీ యూనిఫాంను కులం కోణంలో చూడటం సరికాదని, అలా చేస్తే సైన్యాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్‌ చేశారు.

Also Read : Donald Trump: ఆపరేషన్‌ సిందూర్‌ కి ముందు ట్రంప్‌,పాక్‌ ల మధ్య చీకటి ఒప్పందం ?

Leave A Reply

Your Email Id will not be published!