Zubeen Garg: సింగర్ జుబీన్ మృతిపై జ్యుడీషియల్ కమిటీ
సింగర్ జుబీన్ మృతిపై జ్యుడీషియల్ కమిటీ
Zubeen Garg : ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ప్రత్యేకంగా విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా సారథ్యంలో కమిషన్ ఏర్పాటవుతుందని ఫేస్బుక్లో తెలిపారు. ఈ మేరకు గౌహతి ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారన్నారు. జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతికి దారి తీసిన పరిస్థితులు, కారణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా ఈ కమిషన్ కు అందివ్వవచ్చని సీఎం అన్నారు. జుబీన్ వెంట ఉన్న అసోం అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ సభ్యులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Zubeen Garg Death Mystery
సింగపూర్ (Singapore) లో సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19వ తేదీన జుబీన్ చనిపోవడం తెలిసిందే. ఆయన అక్కడ జరిగే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. దీనితో ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతా, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆ కార్యక్రమ బ్యాండ్ సభ్యులైన శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్‌ప్రభ మహంతాలను అదుపులోకి తీసుకున్నారు. ఈత కొడుతుండగా జుబీన్‌కు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పడవలో వీరిద్దరూ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. జుబీన్ హత్యపై 10 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లయింది. జుబీన్ గార్గ్ మృతిపై నమోదైన 60కి పైగా కేసులను సీఐడీ విచారిస్తోంది.
సింగపూర్ ఆస్పత్రిలో చేపట్టిన జుబీన్ గార్గ్ (Zubeen Garg) పోస్టుమార్టం నివేదికను ఆయన భార్య గరిమాకు అందించామని, గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి చేపట్టిన పోస్టుమార్టం నివేదిక శనివారం అందాక ఆమెకే ఇస్తామని, వాటిని బహిర్గతం చేయాలా వద్దా అనేది ఆమె ఇష్టమన్నారు. శ్యాంకను మహంతా కుంభకోణంపై ఈడీ, ఐడీ దృష్టిసారించాయి. మహంతా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, బినామీ పేర్లను ఆస్తులను కూడబెట్టారంటూ వచి్చన ఆరోపణలను ఈడీ, ఐడీ పరిశీలిస్తున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి కారణంగా ఆరోపణలున్న మహంతాను ఇప్పటికే అసోం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ఈ సందర్భంగా పోలీసులు శ్యాంకను మహంతా గత 20 ఏళ్లుగా పాల్పడుతున్న ఆర్థిక అవకతవకలను గుర్తించారు. వీటి వివరాలను ఐడీ, ఈడీ అధికారులు ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి వెళ్లి తెల్సుకున్నారు.
Zubeen Garg – జుబీన్ గార్గ్ మృతి కేసులో ట్విస్ట్
అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జుబీన్‌కు మిషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడి మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు.
జుబీన్ (Zubeen Garg) మృతిపై అస్సాం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. జుబీన్ బ్యాండ్‌మేట్ గోస్వామి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగానే సంచలన ఆరోపణలు చేశారు. ‘‘సింగపూర్‌లో జుబీన్‌తో కలిసి ఆయన మేనేజర్ సిద్ధార్థ్ శర్మ ఒకే హోటల్లో ఉన్నారు. యాచ్ ట్రిప్‌లో గాయకుడికి ప్రమాదం జరిగిన తర్వాత శర్మ తీరు అనుమానాస్పదంగా కన్పించింది. సముద్రం మధ్యలో యాచ్‌ను మేనేజర్ బలవంతంగా తన నియంత్రణలోకి తీసుకున్నారు. అంతకుముందు మా అందరికీ డ్రింక్స్ తీసుకురావొద్దని అస్సాం అసోసియేషన్ (సింగపూర్) సభ్యుడు, ఎన్ఆర్ఐ తన్మోయ్కు చెప్పారు. సిద్ధార్థ్ శర్మనే స్వయంగా డ్రింక్స్ తీసుకొచ్చారు’’ అని గోస్వామి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఇక, జుబీన్ గార్గ్ మునిగిపోతున్న సమయంలోనూ శర్మ ‘అతని వెళ్లనివ్వండి’ అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి వెల్లడించారు. గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, తనతో పాటు ఎంతోమందికి స్విమ్మింగ్‌లో కోచింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ఈత కొడుతూ నీటమునిగి చనిపోయే ఆస్కారమే లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేనేజర్ శర్మతో కలిసి ఈవెంట్ ఆర్గనైజర్ శ్యాంకను మహంత ఈ కుట్రకు పాల్పడి ఉంటారని గోస్వామి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు జుబీన్‌కు విషమిచ్చి ఉంటారని అన్నారు. ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని ఆరోపించారు. జుబీన్ నోరు, ముక్కు నుంచి నురుగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ ఏ మాత్రం కంగారు పడలేదని అన్నారు. వెంటనే వైద్య చికిత్స అందించకుండా ఆలస్యంగా చేశారని పేర్కొన్నారు.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే జుబీన్ మృతి కేసులో మేనేజర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ అభియోగాలు నమోదు చేశారు. ఇక, ఈవెంట్ ఆర్గనైజర్ మహంత ఆర్థిక వ్యవహారాలపైనా ఆరా తీస్తున్నారు. గతంతో మహంతా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అస్సాం సీఐడీ పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో ఈడీ, ఐటీ విభాగం కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Sonam Wangchuk: తన భర్త నిర్బంధంపై సుప్రీంకోర్టుకు వాంగ్‌చుక్ భార్య గీతాంజలి
