SpiceJet: విమానం టేకాఫ్ వేళ ఊడిపడిన స్పైస్‌జెట్ టైర్
విమానం టేకాఫ్ వేళ ఊడిపడిన స్పైస్‌జెట్ టైర్
SpiceJet : ఓ స్పైస్‌జెట్ విమానానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. టేకాఫ్ సమయంలోనే విమాన చక్రాల్లో ఒకటి ఊడిపోయింది. అయినప్పటికీ ప్రయాణాన్ని కొనసాగించిన ఆ విమానం ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. దీంతో ప్రయాణికులు సహా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తుగా ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు సంబంధిత చర్యలు చేపట్టారు. విమాన ల్యాండింగ్‌కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
SpiceJet Tyre Droped While Takeoff
గుజరాత్‌లోని కండ్లా నుంచి ముంబయికి క్యూ400 స్పైస్‌జెట్ (SpiceJet) విమానం శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, టేకాఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి రన్‌వేపైనే ఊడిపోయింది. విమానం నుంచి ఏదో వస్తువు పడినట్లు గుర్తించిన ఎయిర్‌పోర్టు టవర్ కంట్రోల్ అధికారులు… రన్‌వేపైకి తనిఖీ బృందాలను పంపించారు. విమానం టైరు అని గుర్తించిన వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబయి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. కుడివైపు ఉన్న రెండుటైర్లలో ఒకటి ఊడిపోయినట్లు సమాచారం. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్లు… సురక్షితంగా దించారు. ఈ ఘటనను విమానయాన సంస్థ ధ్రువీకరించింది. విమానం సొంతశక్తితోనే టెర్మినల్‌కు చేరుకుందని, ప్రయాణికులు సురక్షితంగా దిగారని వెల్లడించింది.
కాగా, 2023లో సరిగ్గా ఇలాంటి ఘటన కొచ్చి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. స్పైస్ జెట్‌కు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి బయలుదేరి కొచ్చిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో టైర్ బరస్ట్ అయ్యింది. ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండవడంతో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు.
Also Read : Astra AI: ఫేక్ ప్రచారంపై పోరుకు ‘అస్త్ర ఏఐ’
