SpiceJet : గాల్లో ఉండగా ఊడిన స్పైస్‌ జెట్‌ కిటికీ ఫ్రేమ్‌

గాల్లో ఉండగా ఊడిన స్పైస్‌ జెట్‌ కిటికీ ఫ్రేమ్‌

SpiceJet : విమానాల్లో ప్రయాణీకుల భద్రత రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. ఏవియేషన్ అధికారుల అలసత్వం… విమానయాన సంస్థల నిర్లక్ష్యం కారణంగా… విమానం ఎక్కాలంటే ప్రయాణీకులకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. విమానం ఎక్కాలంటే డబ్బులు ఉండాలి… తిరిగి దిగాలంటే అదృష్టం ఉండాలని అనే చందంగా తయారయింది విమాన ప్రయాణీకుల పరిస్థితి. అహ్మదాబాద్ విమాన ప్రయాణం తరువాత వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు ప్రయాణీకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా జరిగిన మరో ఘటన గోవా నుంచి పుణెకు (Pune) ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు ముచ్చెమటలు పట్టించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

SpiceJet Window Removed

గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్‌ (SpiceJet) క్యూ400 విమానం… గాలిలో ఉండగానే కిటికీ ఫ్రేమ్‌ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్‌ ఇంటీరియర్‌ కిటికీ ఫ్రేమ్‌ను బిగించామని స్పైస్‌జెట్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్‌ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ)కు ట్యాగ్‌చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. దానికి విమానంలో ఊడిన కిటికీ ఫ్రేమ్‌ వీడియోను జోడించారు.

పుణె (Pune) నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్‌ ఊడినట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ బుధవారం ప్రకటించింది. ప్రయాణికుల భద్రతపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది. విమానం పుణెలో దిగిన తర్వాత ప్రామాణిక నిర్వహణ విధానాలకు అనుగుణంగా ఫ్రేమ్‌ను బిగించినట్లు వెల్లడించింది. ‘క్యూ400 విమానంలోని ఒక కాస్మెటిక్‌(లోపలి) కిటికీ ఫ్రేమ్‌ వదులై ఊడినట్లు గుర్తించాం. అప్పుడు విమానంలో పీడనం సాధారణంగానే ఉంది. ఈ ఫ్రేమ్‌ కిటికీ వద్ద నీడ కోసం అమర్చింది. ప్రత్యేక నిర్మాణం కాదు. క్యూ400 విమానం బహుళ పొరల కిటికీ పలకలను కలిగి ఉంటుంది. వీటిలో బలమైన, ఒత్తిడికి తట్టుకునే బయటి పలక ఉంటుంది. ఇది ప్రయాణికుల భద్రత ఎప్పుడూ ప్రమాదంలో పడకుండా చూసుకుంటుంది’ అని స్పైస్‌జెట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

చావు తప్పదని విమానంలోనే వీలునామాలు

చైనాలోని షాంఘై నుంచి జపాన్‌ లోని టోక్యోకు బయల్దేరిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌-737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26వేల అడుగులు కిందకు దిగజారిపోయింది. 36వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం కేవలం 10నిమిషాల్లోనే 10,500అడుగులకు పడిపోయింది. జూన్‌ 30న సాయంత్రం 6.53గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 191 మంది ఉన్నారు. విమానం కుదుపునకు నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు.

విమానం కిందికి పడిపోతున్న క్రమంలో ఆక్సిజన్‌ మాస్కులు బయటకు వచ్చాయి. దీంతో, విమానం తప్పక కూలిపోతుందని, తాము చనిపోవడం ఖాయమని భయపడ్డ చాలా మంది ప్రయాణికులు వీలునామాలు రాశారు. ప్రియమైన వారికి సందేశాలు పంపించారు. బ్యాంకు పిన్‌ నంబర్లు, ఇన్సూరెన్స్‌ లాంటి వివరాలను కుటుంబసభ్యులకు షేర్‌ చేశారు. అయితే, విమానం పైలట్‌ చాకచక్యంగా వ్యహరించడంతో పెనుప్రమాదం తప్పింది. విమానం పడిపోతున్న క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్‌ దాన్ని టోక్యోకు బదులుగా దగ్గర్లో ఒసాకాకు మళ్లించి కాన్‌సాయ్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు.

Also Read : Teacher: 12వ తరగతి విద్యార్ధితో మహిళా టీచర్ బలవంతపు శృంగారం !

Leave A Reply

Your Email Id will not be published!