#MeharBaba : డోన్ట్ వర్రీ, బీ హాపీ నిన‌దించిన‌ ఆధ్యాత్మిక గురువు మెహర్‌ బాబా

Spiritual Guruji Mehr Baba accuses ‘Don’t worry, be happy’

20వ శతాబ్దంలో మెహర్‌ బాబా ‘కారుణ్య పిత’ పిలువబడుతూ, ఉద్యమ కేంద్ర బిందువుగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తన మిలియన్ల శిష్యగణంచే ‘అవతార్ (మానవుడి రూపంలో మాధవుడు)‌’గా కొలువబడ్డాడు. భారతీయ ఆధ్యాత్మిక గురువైన మెహర్‌ బాబా మహారాష్ట్ర పూనెలోని ఇరానీ జొరాస్ట్రీయన్‌ కుటుంబంలో శేరియార్‌ ఇరానీ మరియు షిరీన్‌ ఇరానీలకు రెండవ కొడుకుగా మెర్వన్‌ షెరియర్‌ ఇరానీ పేరున 25 ఫిబ్రవరి 1894న జన్మించారు. తన చిన్నతనం నుంచే మంచి కవి, సంగీత వాయిద్యకారుడిగా ఎదుగుతూనే బహుభాషావేత్తగా కాస్మొపాలిటన్‌ క్లబ్‌ను స్థాపించారు. మెహర్‌ బాబా 19వ ఏట ప్రారంభించి 7 సంవత్సరాలలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులైన హజ్రత్‌ బాబాజన్‌, ఉపస్నీ మహారాజ్‌, షిరిడీ సాయి, తాజుద్దీన్‌ బాబా, నారాయణ్‌ మహరాజ్‌లను ‘ఫర్‌ఫెక్ట్ మాస్టర్స్’గా భావించి, ఆ ఆధ్యాత్మిక గురువులతో సన్నిహితంగా మెదిగి పరివర్తనం చెందారు.

10 జూలై 1925 నుండి మౌనవ్రతం ప్రారంభించి 44 ఏండ్ల పాటు వ్రాత మరియు సైగలతోనే బోధనలు చేశారు. సూఫీ, వేదిక్‌ మరియు యోగా శాస్త్రాలను మేళవించి మానవ జీవనసారాన్ని మరియు జీవన లక్ష్యాలను ప్రభావవంతంగా బోధించే వారు మెహర్‌ బాబా. ప్రతి ఆత్మ పరమాత్మ స్వరూపమని, అందరిలో దేవుడు ఉన్నాడని తన ఉపన్యాసాలను అందించారు. ‘గాడ్‌ స్పీక్స్’ అనే పుస్తకాల ద్వారా తన సందేశాలను భక్తకోటికి అందించారు. తన బోధనల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం, పునరావాసం, మానస్థత్వశాస్త్రం, మెటాఫిజిక్స్ లాంటి మేధో అంశాలు ఉండేవి. తన శిష్యులు ఏర్పాటు చేసిన ‘అవతార్‌ మెహర్‌ బాబా చారిటబుల్‌ ట్రస్ట్’ స్థాపించి వారి బోధనలను నేటితరాలకు అందుబాటులో ఉంచారు.

‘డోన్ట్ వర్రీ, బీ హాపీ’ అనే నినాదంతో తన బోధనలను విశ్వవ్యాప్తం చేశారు. 1920ల్లో అహ్మద్‍నగర్‌ సమీపంలో మెహరాబాద్‍ (దీవెనల వనం) ఆశ్రమాన్ని స్థాపించి పాఠశాలలు, ఆసుపత్రులు ఉచితంగా నిర్వహించారు. కుష్టురోగులు, వికలాంగులు, దళితులు మరియు పేదలకు ఉచిత సేవలు చేశారు. 1931 నుండి యూరప్‌, అమెరికా, ఇంగ్లాండ్‌లను పర్యటించి శిష్యమండలికి ఉపన్యాసాలు అందిస్తూనే పలు ప్రముఖులను కలుసుకునే వారు. గాంధీతో మూడుసార్లు కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

1949 – 1952 మధ్య కొద్ది మంది శిష్యులతో కలిసి ‘న్యూ లైఫ్‌’ సిద్ధాంతంతో తన అదీనంలో ఉన్న ఆస్తులను విడిచి బాబా బోధనలను భారతమంతా వినిపించారు. 31 జనవరి 1969న మెహరాబాద్‍ ఆశ్రమంలో ‘నేను దేవుడి అవతారమని మరువకండి’ అని సూచిస్తూ తుది శ్వాస విడిచారు.

బాబా శిష్యులు తన వర్ధంతిని ‘అమరతిథి (మరణంలేని దినం)గా పాటిస్తారు. బాబా పార్థివదేహాన్ని గులాబీలు మరియు మంచు గడ్డలతో కప్పి వారం రోజులు శిష్యుల కడపటి దర్శనానికి అందుబాటులో ఉంచారు. మెహరాబాద్‍లోని బాబా సమాధి నేటికీ దర్శనీయ స్థలంగా ప్రసిద్ధి పొందింది. ‘ది అవేకనర్‌ (మేలుకొలిపే వాడు)’గా పిలువబడిన మెహర్‌ బాబా రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు మరియు మహ్మద్‍ ప్రవక్తలు ఒక్కరే అని ప్రభోదించారు. ‘అవసరార్థులకు సేవ చేయడం అన్ని ప్రార్థనల కన్న మిన్న’ అని బోధించిన బాబా ‘చింతించకండి, సంతోషంగా ఉండడని’ మానవాళికి పిలుపునిచ్చారు. మౌనంతోనే మానవత్వాన్ని, జీవనతత్వాన్ని, జీవిత పరమార్ధన్ని బోధించిన మెహర్‌ బాబా నేటి యువతకు మార్గదర్శకం చేయాలని ఆశిద్దాం.
(31 జనవరి ‘మెహర్‌ బాబా వర్ధంతి సందర్భంగా)

No comment allowed please