State Election Commissioner: ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
State Election Commissioner : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం నాడు అమరావతిలో ఎస్ఈసీ (State Election Commissioner) నీలం సాహ్ని మాట్లాడుతూ… ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వాడారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇక ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
State Election Commissioner Key Comments
మరోవైపు ఏపీలో (AP) స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే అంటే… 2026, జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commissioner) కసరత్తు చేస్తుంది. ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి మూడు నెలలు ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇటీవల లేఖలు రాశారు. నగర పాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం 2026, మార్చిలో.. అలాగే సర్పంచుల పదవీ కాలం సైతం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. దీంతో మూడు నెలలు ముందే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన లేఖలో తెలిపారు.
పీఎస్ఆర్ ఆంజనేయులుకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
సీనియర ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మంగళవారం జారీ చేశారు. ముంబైకి చెందిన నటి కుమారి కాదంబరి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సదరు ఐపీఎస్ అధికారి.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గతంలో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
అయితే పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌పై రివ్యూ కమిటీ.. సెప్టెంబర్ 2వ తేదీన సమావేశమైంది. అందులో భాగంగా జత్వాని కేసులో తాజా పరిణామాలను ఈ రివ్యూ కమిటీ పరిశీలించింది. సస్పెన్షన్ ఎత్తి వేస్తే.. ఈ కేసును ఆయన ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఈ రివ్యూ కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వానికి రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో అందుకు అనుగుణంగా సీఎస్ కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2026, మార్చి8 వ తేదీ వరకు పీఎస్ఆర్ ఆంజనేయులుపై సస్పెన్షన్ పొడిగించినట్లు అయింది.
ఇక ఇదే కేసులో ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటాపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై కూడా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. రాణా టాటాపై ఉన్న సస్పెన్షన్ వేటు ఎత్తి వేస్తే.. ఈ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రివ్యూ కమిటీ తన సమావేశంలో అభిప్రాయపడింది. ఇదే కారణాన్ని ప్రభుత్వానికి వివరించింది. దాంతో కాంతి రాణా టాటాపై సైతం ప్రభుత్వం సస్పెన్షన్‌ను పొడిగించింది. దీంతో 2026, మార్చి 8వ తేదీ వరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది.
Also Read : Telangana Government: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా ?
