Stree Shakti Scheme: మహిళలకు ‘ఉచిత బస్సు’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
మహిళలకు ‘ఉచిత బస్సు’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Stree Shakti Scheme : ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చింది. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం ‘స్త్రీశక్తి’ పథకాన్ని (Stree Shakti Scheme) సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి సీఎం విజయవాడకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల నుంచి వారి రోజు వారి ప్రయాణ అవసరాలు, వారి కుటుంబ జీవనోపాధికి సంబధించిన అంశాలు తెలుసుకున్నారు.
Stree Shakti Scheme Started
అంతకుముందు ఉండవల్లి గుహల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) ఘనస్వాగతం పలికారు. ఉండవల్లి సెంటర్ నుంచి తాడేపల్లిలోని భారత మాత విగ్రహం, వారధి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, మాధవ్ ప్రయాణం సాగింది. అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘స్త్రీశక్తి’ పథకాన్ని ఉద్దేశ్యించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘ఈరోజు గర్వంగా చెబుతున్నా సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యింది. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్ల పాటు నవ్వడమే మరిచిపోయారు. ఇంటా, బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయింది. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టాం. మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. మహిళా సాధికారిత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలి. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Stree Shakti Scheme – కుటుంబాలకు ఆసరా ‘స్త్రీశక్తి’ పథకం
స్త్రీశక్తి పథకం (Stree Shakti Scheme)… పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేయనుంది. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకు ఇకపై ఛార్జీల భారం ఉండదు. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థినులు బస్ పాస్‌లు కొనాల్సిన అవసరం లేకుండానే బస్సుల్లో రాకపోకలు సాగించవచ్చు. మహిళా రైతులు, వ్యాపారులు, కూలీ చేసుకునేవారు… తమ గ్రామాల నుంచి దగ్గరలోని పట్టణాలకు ఉచితంగా ప్రయాణించడం ద్వారా ఛార్జీల రూపంలో ఖర్చు మిగులుతుంది. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకాతిరుమల, శ్రీకాళహస్తి. విజయవాడ కనకదుర్గమ్మ వంటి ప్రధాన ఆలయాలకు వెళ్లాలనుకున్నా బస్ఛార్జీల భారం కారణంగా వెళ్లలేనివారే అధికం. ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్ఛార్జీల భారం లేకపోవడంతో… తక్కువ ఖర్చుతో ఆలయాలకు వెళ్లివచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది. మొత్తంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ.4 వేల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుందని అంచనా.
శుక్రవారం సాయంత్రం నుంచి ఐదు రకాల బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీచేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్లపై స్త్రీశక్తి పథకం అని ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు.. ప్రయాణ ఛార్జీ ఎంతో ఉంటుంది. ఆ సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని… ప్రయాణికురాలు చెల్లించాల్సింది సున్నా (0) అని ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు.
Stree Shakti Scheme – మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం – పవన్ కల్యాణ్
ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,450 బస్సులు సిద్ధం చేసినట్టు చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. అన్ని రకాల అవరోధాలను అధిగమించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు.
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా.. మహిళలకే సాధ్యం
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా.. అది మహిళలతోనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మాట్లాడుతూ.. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయన్నారు. మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతోందని గుర్తు చేశారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడేదని (CM Chandrababu) కొనియాడారు. కొంత మంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోని అన్న.. మహిళల గురించి మాట్లాడుతున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు మంత్రి లోకేష్ (Minister Nara Lokesh). గతంలో మద్యపాన నిషేధం చేస్తానని ఓ రాక్షసుడు చెప్పాడన్నారు. కానీ.. జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. ఇతర మహిళలకు న్యాయం చేస్తారా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. తల్లి మీద కేసు గెలిస్తే.. సంబరాలు చేసుకున్నారంటూ జగన్‌పై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. తల్లి, చెల్లికి న్యాయం చేశాకే తన గురించి మాట్లాడాలని వారిని కోరుతున్నానంటూ వైసీపీ అగ్రనాయకత్వానికి లోకేష్ కియర్ కట్‌గా స్పష్టం చేశారు.
భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనన్నారు. మహిళల అభ్యున్నతికి పాటు పడుతున్నది టీడీపేనేనని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా అమలు చేసింది కూడా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే అని గుర్తు చేశారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు అమలు చేసింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందీ సీఎం చంద్రబాబే అని వెల్లడించారు. మహిళలను అన్ని విధాలా అభివృద్ధి చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారని వివరించారు. మహిళలను కించ పరిచేలా సీరియళ్లు, చిత్రాలు రాకుండా చట్టాన్ని తీసుకురావాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
Also Read : CM Chandrababu: విజయవాడలో జాతీయజెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
