SSC Exams: తాచుపాము కాటుకు చికిత్స పొందుతూ పరీక్ష రాసిన 10వ తరగతి విద్యార్థి
తాచుపాము కాటుకు చికిత్స పొందుతూ పరీక్ష రాసిన పదో తరగతి విద్యార్థి
SSC Exams : పరీక్షలు అందులోనూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అంటే చాలా విద్యార్ధులు చాలా ఒత్తిడికి గురవుతారు. కొంతమందికి పరీక్షలు దగ్గరపడ్డాయంటే చాలు… లేని పోని రోగాలు వస్తుంటాయి. పరీక్షల రోజు చిన్న గాయం తగిలినా చాలు డుమ్మా కొట్టడానికి చూస్తుంటారు. మరికొంత మంది ఈ పరీక్షల నుండి ఎంత వేగం గట్టెక్కుతామా లేదా ఎలా తప్పించుకోవాలా అన్నట్లు చూస్తుంటారు. అయితే పాము కరిచినా సరే పదవ తరగతి పరీక్షలు(10th Class Exams) మాత్రం మానుకోలేదు ఓ విద్యార్ధి. ఆసుపత్రి నుండి నేరుగా పరీక్షా కేంద్రానికి అక్కడ నుండి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి చదువు, పరీక్షల పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుతున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
SSC Exams…
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో వై.నిస్సీ అనే విద్యార్థి చదువుకుంటున్నాడు. పదో తరగతి పరీక్షల(10th Class Exams) నేపథ్యంలో ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్న సమయంలో రాయి కింద వేలు దూర్చగా… ఏదో కుట్టినట్లు అనిపించింది. వెంటనే రాయి పక్కకి తీసి చూడగా తాచుపాము పిల్ల కనిపించింది. దీనితో వెంటనే తనను ఉపాధ్యాయులు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం, ఆదివారం అక్కడే ఉన్నాడు. అయితే సోమవారం పరీక్షలు మొదలు కావటంతో ఆస్పత్రినుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష రాశాడు. అనంతరం మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. చదువులన్నా.. పరీక్షలన్నా భయపడే పిల్లలున్న ఈ కాలంలో… నిస్సికి చదువుపట్ల ఉన్న శ్రద్ధా భక్తులు చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.
అధికారుల పొరపాటు.. ఒక పేపర్‌కు బదులు మరో పేపర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. చివరి పరీక్షను రంజాన్ పండుగ ఆధారంగా మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు. 2024-2025 విద్యాసంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నేపథ్యంలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పరీక్ష సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటోంది. ఎంత పగడ్భందీగా ప్లాన్ చేసినా… కొన్ని చోట్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి. తెనాలి ఎన్ఎస్ఎం పాఠశాలలో అధికారులు పొరపాటు చేశారు. ఓ విద్యార్ధికి స్పెషల్ తెలుగు ప్రశ్నాపత్రం పంపిణీ చేయడానికి బదులు సాధారణ ప్రశ్నాపత్రం పంపిణీ చేశారు. జరిగిన పొరపాటుపై అధికారులు అధికారులు విచారణ చేపట్టారు. జాబితా చూసుకోకుండా వేరే ప్రశ్నాపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు.
Also Read : BRS Activists: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్