Suneetha Narreddy: సీఎం జగన్ పై వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు !
సీఎం జగన్ పై వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు !
Suneetha Narreddy: హత్యలకు పాల్పడేవారికి పాలించే హక్కులేదని మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి స్పష్టం చేసారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం గత ఐదేళ్ళుగా పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో నిర్ధరణకు రావొచ్చు. కాని వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదు అని ఆమె ప్రశ్నించారు. నా చెల్లమ్మలు అని పదేపదే చెప్పే సీఎం జగన్… మాటతప్పను మడం తిప్పను అని చెప్పే సీఎం జగన్… నా తండ్రి విషయంలో ఎందుకు నిందితులను కాపాడుతున్నారని ఆమె ప్రశ్రించారు. దీనికి ప్రజా కోర్టులో తీర్పుకావాలి కాబట్టి… హత్యా రాజకీయాలకు పాల్పడే తన సోదరుడు జగన్ పార్టీకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
Suneetha Narreddy – హత్యకేసులో కీలక సూత్రధారి అవినాష్ రెడ్డి !
హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్ నా వద్దకు వచ్చారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు… మనం మాత్రం రియలైజ్ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది ? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు ? నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు ? అది బయటకు రావాలి. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉంది. వాళ్లిద్దరినీ జగన్ రక్షిస్తున్నారు. అవినాష్‌రెడ్డికి శిక్ష పడాలి… పడుతుంది. వంచన, మోసానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
ఇచ్చిన మాట మీద నిలబడతా… విలువలు, విశ్వసనీయత అంటూ జగన్ పదేపదే చెప్తున్నారు. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలి. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేం… అందుకే జగన్‌ను కలిసినప్పుడు నాకు ఆయనపై అనుమానం రాలేదు. ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. ఈ హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయి.. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయి. జగన్ పాత్రపైనా విచారణ చేయాలి… నిర్దోషి అయితే వదిలేయాలి. తప్పు చేసిన వారు మాత్రం తప్పించుకోకూడదు అని ఆమె అన్నారు. అవినాష్ అరెస్టు కోసం సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లినపుడు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అరెస్టు చేయడానికి సీబీఐ వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా ? అరెస్టు చేయాల్సిన వ్యక్తి కళ్లెదుటే ఉన్నా… దర్యాప్తు సంస్థ అధికారులు రెండు రోజులు ఎదురుచూసి వెనక్కి వచ్చారు.
సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో?
నిందితులు ఒక్కసారి బెయిల్‌పై బయటకొస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేయరా ? జగనన్న కేసుల వల్లే మా నాన్న హత్య కేసును సాగదీస్తున్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు. అనుమానితులుగానే నన్ను, నా భర్తను ప్రశ్నించారు. ప్రభుత్వం వెనుక ఉంది కాబట్టే మాపై కేసులు పెట్టారు. నాలాగే అందరినీ విచారించాలి. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను గుర్తించాలి. నేను ప్రజల్లోకి వెళ్తా… అయితే ఎలా వెళ్లాలనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. నేను పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని సునీతారెడ్డి అన్నారు.
Also Read : MP B. B. Patil: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ !