Sunita Williams: అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఒక అద్భుతం – సునీతా విలియమ్స్
అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఒక అద్భుతం - సునీతా విలియమ్స్
Sunita Williams : అనూహ్యంగా అంతరిక్షంలో 9 నెలల పాటు చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన భారత(India) సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తాజాగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. భూమిని చేరిన వెంటనే వివిధ వైద్య పరీక్షలు, ఇతర వ్యవహారాల నిమిత్తం నాసా కేంద్రంలో ఉన్న ఈ వ్యోమగాములు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వీరు… తమ తొమ్మిది నెలల అంతరిక్ష ప్రయాణం, రోదసిలో తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి భారత్ ఎలా కన్పించిందని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత ఆశక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అంతరిక్షం నుంచి చూస్తే భారత్ చాలా అద్భుతంగా కన్పించిందని తెలిపారు. అంతేకాదు… త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
Sunita Williams Comment
ఈ సందర్భంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) మాట్లాడుతూ… ‘‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్ చాలా అద్భుతంగా ఉంది. మేం హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతీసారి… ఆ మంచు కొండల అందాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబయి వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు… తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్ లాగా పనిచేసేవి. ఇక మొత్తంగా భారత్ నాకు ఎలా కన్పించిందంటే… పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్‌వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కన్పించేది. ఇక హిమాలయాలైతే అత్యద్భుతం’’ అని సునీతా విలియమ్స్ వివరించారు.
భారత్ పర్యటన అవకాశాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ‘‘నా తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగివెళ్లాలని అనుకుంటున్నా. అక్కడి బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో నా అనుభవాలను వారితో పంచుకోవాలని ఉంది’’ అని సునీత ఆనందం వ్యక్తం చేశారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని, అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోనూ ఆ మూలాలు ఉండటం గర్వంగా ఉందన్నారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. దీనితో ఈ ఇద్దరు వ్యోమగాములు 286 రోజుల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారు చివరికి మార్చి 19న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా… సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. 1958లో ఆయన అగ్రరాజ్యానికి వలస వెళ్లారు.
Also Read : Minister Nara Lokesh: దేశంలో ఐదవ ఎకనామిక్ క్యాపిటల్ గా విశాఖ – మంత్రి నారా లోకేష్