Sunita Williams: మార్చి నెలాఖర్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

మార్చి నెలాఖర్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

Sunita Williams : గత తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి రానున్నారు. నాసా వర్గాల సమాచారం ప్రకారం సునీత, విల్మోర్‌ స్థానంలో అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసేందుకు మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే వారమే అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. ఆ వ్యోమగాములు అంతరిక్షానికి చేరుకున్నాక… అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో సునీత విల్మోర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి భూమి మీదకు చేరుకుంటారు. దీనితో దాదాపు 10 నెలల తరువాత సునీతా, విల్మోర్ లు భూమిపై అడుగుపెట్టనున్నారు.

Sunita Williams Return

ఈ సందర్భంగా ఐఎస్ఎస్‌ నుంచి సునీత(Sunita Williams), విల్మోర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రదేశం (అంతరిక్ష కేంద్రం) నిజంగా అద్భుతం అని, అత్యునత్న శిఖరమ్మీద ఉన్న భావన కలుగుతోందని సునీతా విలియమ్స్‌ పేర్కొన్నారు. అయితే తాము ఎప్పుడు తిరిగి వస్తామనే విషయంలో భూమ్మీదున్నవారికి కచ్చితమైన సమాచారం లేకపోవడం… ఫలితంగా నెలకొన్న తీవ్ర అనిశ్చితి బహుశా అత్యంత కఠినమైన అంశం అని విలియమ్స్‌ పేర్కొన్నారు. త్వరలోనే భూమ్మీదకు తిరిగి రానున్న నేపథ్యంలో తన పెంపుడు కుక్కలను మళ్లీ చూడబోతున్నానే విషయం తనను ఉద్విగ్నతకు గురిచేస్తోందని చెప్పారు. కాగా ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2030 వరకు కాకుండా వెంటనే అంతరిక్ష కేంద్రాన్ని మూసివేయాలంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రతిపాదనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పేస్‌ స్టేషన్‌ను మూసేయాలని చెప్పడానికి ఇది సరైన సమయం కాదని ఆమె పేర్కొన్నారు.

Also Read : Maha Kumbh Mela: కుంభమేళాలో ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాది అరెస్టు

Leave A Reply

Your Email Id will not be published!