Sunita Williams: సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్రకు బ్రేక్ !

సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్రకు బ్రేక్ !

Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు బ్రేక్ పడింది. సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ రోదసీ యాత్రను తాత్కాలికంగా ఆపినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా… తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు. సునీతా విలియమ్స్ బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో మూడో సారి అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్‌-V రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే 90 నిమిషాల ముందర రాకెట్‌ లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత(Sunita Williams)… మిషన్‌ పైలట్‌ గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్‌ విల్‌మోర్‌ కూడా వెళ్లాల్సి ఉంది.

Sunita Williams Trip

ఈ మిషన్‌ ప్రకారం… వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌ లైనర్‌ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌ లైనర్‌ తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.

తాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ఐఎస్‌ఎస్‌కు వెళ్తుంటే… సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌ లైనర్‌ కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల కాస్తా ఉత్కంఠగా ఉంది. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌ వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.

Also Read : PM Modi : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం

Leave A Reply

Your Email Id will not be published!