Supreme Court: రోహింగ్యాలు చొరబాటుదారులా? శరణార్థులా? – సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

రోహింగ్యాలు చొరబాటుదారులా? శరణార్థులా? - సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

Supreme Court : రోహింగ్యాలకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వాళ్లు శరణార్థులా, చొరబాటుదారులా అనేదే పెద్ద సమస్య… తొలుత దీనిపై క్లారిటీ వస్తే ఇతర సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయని పేర్కొంది. ఒకవేళ వాళ్లు చొరబాటుదారులైతే వారిని బహిష్కరిస్తున్నారా? అని ప్రశ్నించింది. రోహింగ్యాల విషయంలో దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కోటిశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Supreme Court of India Strong Question

‘‘శరణార్థులా లేదా చొరబాటుదారులా అనేదే ప్రధాన సమస్య. శరణార్థులుగా ప్రకటించేందుకు వారు అర్హులు కాదా? అలా ఐతే, వారికి ఎలాంటి రక్షణలు, హక్కులు ఉంటాయి? ఇక రెండో అంశం… శరణార్థులు కాకుంటే, అక్రమ వలసదారులైతే… వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిష్కరించే చర్య సరైనదేనా? చొరబాటుదారులను నిరవధికంగా నిర్బంధించడం లేదా బెయిల్‌పై విడుదల చేయవచ్చా? కోర్టులు ఎటువంటి షరతులు విధించవచ్చు? అని అని సుప్రీం ధర్మాసనం (Supreme Court) ప్రశ్నించింది.

పిటిషనర్ల తరఫున న్యాయవాది మాట్లాడుతూ… రోహింగ్యాల నిర్బంధమే కీలక అంశమని, వారిని నిరవధికంగా అలా కొనసాగించలేరని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. రోహింగ్యాలకు సంబంధించి దాఖలైన అనేక పిటిషన్లను మూడు విభాగాలుగా విభజించి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రతి బుధవారం వీటిని విచారించేందుకు సమయాన్ని కేటాయిస్తామని తెలిపింది.

ఇదే అంశంపై ఈ ఏడాది మే నెలలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు (Supreme Court) … దేశంలో ఉన్న రోహింగ్య శరణార్థులు విదేశీయులని తేలితే, భారత చట్టాల ప్రకారం వారిని తిరిగి పంపించాల్సిందేనని అభిప్రాయపడింది. యూఎన్‌హెచ్‌సీఆర్‌ జారీ చేసిన ఐడీ కార్డులు కూడా వారికి ఎటువంటి సాయం చేయకపోవచ్చంటూ అంతకుముందు ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేసింది. ఇదిలాఉంటే, దేశంలో 12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు నివసిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దిల్లీ, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వీరు ఉంటున్నప్పటికీ.. కచ్చితంగా ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని కేంద్ర హోంశాఖ గతంలో ఓసారి వెల్లడించింది.

Also Read : Jammu Kashmir: పాకిస్తాన్ కు భారత్ షాక్ ! చీనాబ్‌పై ‘సావల్‌కోట్‌’ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ !

Leave A Reply

Your Email Id will not be published!