Supreme Court: తమ ఆస్తుల ప్రకటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం
తమ ఆస్తుల ప్రకటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం
Supreme Court : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో బయట పడ్డ నోట్ల కట్టలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఓ హై కోర్టు జడ్జి ఇంట్లో లెక్కచూపని కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయటపడటంతో న్యాయ వ్యవస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా 30 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.
Supreme Court..
ఇప్పటికే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. చీఫ్ జస్టిస్ సహా సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రస్తుతం 30 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన వీరందరితో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అంతకుముందు… 1997లో చేసిన తీర్మానం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉంది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలంటూనే… దానిని తప్పనిసరి చేయకుండా, జడ్జిల ఇష్టానికే వదిలేస్తూ 2009లో ఒక తీర్మానం చేశారు. దీనితో చాలామంది న్యాయమూర్తులు తమ ఆస్తులను బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ఎవరికీ ఆ మినహాయింపు ఉండదు. ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టు జడ్జిలంతా తమ ఆస్తులను బహిర్గతం చేయాల్సిందే. ఆ వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పెడతారు.
Also Read : Waqf Bill: రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లుకు పచ్చజెండా