Supreme Court: రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కు సుప్రీం ఆదేశాలు

రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కు సుప్రీం ఆదేశాలు

Supreme Court : రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద(Road Accident) బాధితులకు నగదు అవసరం లేకుండా అంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులు రూ.1.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….

Supreme Court of India

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు ప్రమేయం లేకుండా చికిత్సలు అందించే పథకాన్ని స్ఫూర్తితో అమలు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకం కింద ప్రతి ప్రమాద బాధితుడు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు సహాయం పొందడానికి అవకాశం ఉంది. దీని అమలు తీరుపై ఆగస్టులోగా ప్రమాణ పత్రం సమర్పించాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం సూచించింది. ఈ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందారో వివరించాలని తెలిపింది. ప్రమాద బాధితులకు నగదు తీసుకోకుండానే చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Supreme Court) జనవరి 8న ఆదేశించింది. ఆ ఆదేశాల అమలులో జాప్యం జరగడంతో ఏప్రిల్‌ 28న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2022లో ఆమోదించిన మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 164ఏలో చికిత్సల ప్రస్తావన ఉన్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. దీనితో నగదు రహిత చికిత్సలపై నూతన విధానాన్ని రూపొందించినట్టు ఈ నెల అయిదో తేదీన కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీని అమలుపైనే సమాచారం ఇవ్వాలని ప్రస్తుతం ఆదేశించింది.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలం చికిత్స అందించగలితే వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాణాలకు బలవుతున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదాల్లో గాయపడినవారికి ఇకపై రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది. ఇందుకు సంబంధించిన కేంద్ర రహదారుల రవాణాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’ పేరుతో ఈ పథకం అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో రోడ్డు ప్రమాదాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సదస్సుల్లో రోడ్డు ప్రమాదాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే… తాను మొహం చాటేస్తున్నానని తెలిపారు.

సుప్రీంకోర్టు(Supreme Court) గత జనవరిలో రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌ లో ఉచిత వైద్యం అందించాలని తీర్పు వెలువరించింది. దీనికి అనుగుణంగా కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. నోటిఫికేషన్‌లో “క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025” అనే పేరుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద మోటారు వాహనం ప్రమాదానికి గురైతే రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ట్రామా, పాలీట్రామా సేవలు అందించే ఆసుపత్రులను ఈ పథకం కిందకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకురాగానే వైద్య సేవలు ప్రారంభించాలి. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోతే, వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలి. రవాణా సౌకర్యాన్ని కూడా ఆసుపత్రే ఏర్పాటు చేయాలి. బాధితుడిని డిశ్చార్జ్ చేసిన తర్వాత, ఆసుపత్రి బిల్లును పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ పథకం స్థానికులు, పేదలు అనే తేడా లేకుండా ప్రమాదానికి గురైన ఎవరికి అయినా వర్తిస్తుంది. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఆధార్ లేకున్నా కూడా చికిత్స ప్రారంభించవచ్చు. ఈ స్కీంలో ఆసుపత్రులకు వేగంగా బిల్లుల చెల్లింపు అందించే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావడానికి తోడ్పడుతుంది. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేవారికి కూడా కేంద్రం రూ.25 వేలు ప్రోత్సహకాన్ని కూడా అందజేస్తోంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభ దశలో రూ. 500 కోట్లు మంజూరు చేసింది. అమలు బాధ్యత నేషనల్ హెల్త్ అథారిటీ, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపడుతున్నాయి. డిజిటల్ ట్రాకింగ్, జియో-ట్యాగింగ్, లైవ్ స్టేటస్ మానిటరింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు ఉపయోగించనున్నారు. ఈ పథకానికి నిధులు కేంద్రమే భరించనుంది.

Also Read : Spurious Liquor: పంజాబ్‌లో విషాదం ! కల్తీ మద్యం తాగి 21 మంది మృతి !

Leave A Reply

Your Email Id will not be published!