Supreme Court: జైలు కావాలా ? బెయిల్ కావాలా ? – తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టు ఆఫర్
జైలు కావాలా ? బెయిల్ కావాలా ? - తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టు ఆఫర్
Supreme Court : మంత్రి పదవి కావాలా లేక బెయిల్ కావాలా అంటూ తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నగదు మోసం కేసులో 2023 జూన్ లో ఈడీ అరెస్టు చేసిన సెంథిల్ బాలాజీ… గతేడాది సెప్టెంబరులో బెయిల్‌పై బయటికొచ్చారు. మరుసటి రోజే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీకి మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలని సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖలైన పిటిషన్ పై బుధవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. సెంథిల్ బాలాజీ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది వాదించారు.
సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయం ఉంటే కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సెంథిల్ బాలాజీ(Senthil Balaji) తరఫు న్యాయవాది కోరారు. ఆయనకు బెయిలు మంజూరు చేసిన సమయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మంత్రిగా లేకపోవడంతోనే ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు పరిశీలించామని అన్నారు. సెంథిల్ బాలాజీకి బెయిల్ కావాలా లేదా మంత్రి పదవి కావాలా అనేది సోమవారం నాటికి తెలియజేయాలని గడువు ఇచ్చి విచారణ వాయిదా వేశారు.
Supreme Court – రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు – మంత్రికి సుప్రీం హెచ్చరిక
మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు చేస్తామని డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పదవి కావాలో ? స్వేచ్ఛ కావాలో ? తేల్చుకోవాలని సూచించింది. బెయిల్ మంజూరు చేయడం అంటే సాక్షులను ప్రభావితం చేసే అధికారం ఇచ్చినట్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు సాక్షులను ప్రభావితం చేస్తారని తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. పదవి (మంత్రి), స్వేచ్ఛ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మాకు చెప్పండి’అని పేర్కొంది. మనీలాండరింగ్ కేసుల్లో కోర్టు రూపొందించిన ఉదార బెయిల్ చట్టాన్ని రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొంత సమయం కావాలంటూ బాలాజీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
Also Read : CM Chandrababu Naidu: టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు