SC Hate Speeches : రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలి – సుప్రీమ్ కోర్టు
SC Hate Speeches : దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ సందర్భంగా మతాలను రాజకీయాల నుంచి వేరుచేస్తే, విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్టుపడుతుందని అభిప్రాయపడింది. రాజకీయ నాయకులు మతాలను వాడుకోవడం మానేస్తేనే రెచ్చగొట్టే ఉపన్యాసాలకు ముగింపు పడుతుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది.
విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగాలను ఉదహరించింది. వారి ప్రసంగాలను వినేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచీ ప్రజలు వచ్చేవారని ధర్మాసనం గుర్తు చేసింది. విద్వేష ప్రసంగాలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలు ఎందుకు ప్రతిజ్ఞ తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది.
ఎవరో ఒకరు ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నా.. వారిపై కేసులు నమోదు చేయడంలో రాష్ట్రాలు విఫలం అవుతున్నాయని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజకీయాలతో మతాన్ని మిళితం చేయడంతోనే అసలు సమస్య వస్తోందని మండిపడింది. మతాన్ని అడ్డుపెట్టుకొని చేసే రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరికలు చేసింది. ప్రస్తుత కేసులో కక్షిదారుగా చేరుతామంటూ హిందూ సమాజ్ సంస్థ చేసిన అభ్యర్థనను ధర్మాసనం అనుమతించింది.
హిందూ సమాజ్ మహారాష్ట్రలో కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. చట్టాలను ఉల్లంఘిస్తూపోతే అందరితో పాటు మీకూ తీవ్ర నష్టం కలిగిస్తాయని సంస్థ తరఫు ప్రతినిధులను హెచ్చరించింది. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధించి, ప్రపంచ శక్తిగా అవతరించాలంటే చట్టబద్ధమైన పాలన కొనసాగి, నివాస యోగ్యమైన దేశంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని, పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసినప్పుడే ఈ తరహా నేరాలకు అడ్డుకట్టపడుతుందని వివరించింది. అలాగే, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని ధర్మాసనం తెలిపింది.
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా… విద్వేష ప్రసంగాలపై పిటిషన్ దాఖలు చేసిన షహీన్ అబ్దుల్లా ఎంపిక చేసిన కొన్ని ఉపన్యాసాలను మాత్రమే ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారని ఆరోపించారు.
Also Read : మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 13న కౌంటింగ్