Supreme Court: బిహార్ లో రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆగ్రహం
బిహార్ లో రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆగ్రహం
Supreme Court : బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) వివాదంపై సుప్రీం కోర్టులోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డిలీట్ చేసిన ఓటర్ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బీహార్ ఓటర్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రజల తరపున స్పందించడంలో ఘోరంగా విఫలమయ్యాయని కోర్టు అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని కోరింది. అదే సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉండాలని పునరుద్ఘాటించింది. ‘‘డిలీట్ చేసిన పేర్ల విషయంలో ఆధార్ కార్డు లేదా… ఏదైనా ఆమోదయోగ్య పత్రంతో పాటు చేసే ఆన్‌లైన్ సబ్మిషన్లను అనుమతిస్తాం’’ అని న్యాయస్థానం పేర్కొంది. పేర్ల తొలగింపులపై భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వస్తే దరఖాస్తు సమర్పణల తుది గడువును ఎందుకు పొడిగించకూడదని జస్టిస్ కాంత్ ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రశ్నించారు.
Supreme Court Slams
మరోవైపు ఈ ప్రక్రియలో బిహార్ (Bihar) రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములై తమ బూత్ స్థాయి ఏజెంట్లతో ఓటర్లకు సాయం చేయాలని కోర్టు పేర్కొంది. సూచించిన 11 పత్రాలు లేదా ఆధార్ ఏదైన ఒక దానిని సమర్పించి.. పేరు తొలగింపుపై అభ్యంతరాలు తెలియజేస్తూ.. పేరు తిరిగి చేర్చాలనే దరఖాస్తు ఇవ్వాలని వెల్లడించింది. అదే సమయంలో రాజకీయ పార్టీల మధ్య వివాదాలకు ఓటర్లకు లంకె పెట్టకూడదని జస్టిస్ కాంత్ సూచించారు.
బీహార్‌లో (Bihar) 65 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడిన అంశంపై శుక్రవారం సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ జరిపింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో.. ఎన్నికల సంఘం బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను చేపట్టింది. ఇందులో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా అభ్యంతరాలుగానీ, ఫిర్యాదు గానీ చేయలేదు అని ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో పార్టీల నిష్క్రియతపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మీరు ఏమి చేస్తున్నారు?.. చోద్యం చూస్తున్నారా? అంటూ రాజకీయ పార్టీలను, ప్రత్యేకించి విపక్షాలను ప్రశ్నించింది. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలదేనని.. కానీ ప్రతిస్పందించడంలో వాళ్లు విఫలమయ్యారు వ్యాఖ్యానించింది.
బూత్ స్థాయి ఏజెంట్లు నియమించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు సహాయం చేయడంలో విఫలమయ్యాయి. అసలు రాజకీయ నాయకులు ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు ? అని నిలదీసింది. ఈ కేసులో 12 ప్రధాన రాజకీయ పార్టీలను ఇంప్లీడ్(పక్షాలుగా చేరుస్తూ) చేస్తూ… పార్టీలు తమ కార్యకర్తలకు ఓటర్ల ఫిర్యాదులు నమోదు చేయడంలో సహాయం చేయాలని.. ECI సూచించిన 11 పత్రాలు లేదంటే ఆధార్ కార్డు ఆధారంగా ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court – బీహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపుపై ఈసీ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలు
• ఆగస్టు 1న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల వివరాలు రాష్ట్రంలోని 38 జిల్లాల ఎన్నికల అధికారుల వెబ్‌సైట్లలో ప్రచురించాం
• మరణాలు, ఇతర ప్రాంతాలకు వలస, డూప్లికేట్ నమోదు కారణాలతో తొలగింపు ప్రక్రియ కొనసాగింది
•భౌతిక ప్రతులను పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించబడ్డాయి.
• ప్రచారం కోసం పత్రికలు, రేడియో, టీవీ, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేశాం.
• ఈ చర్యలు ఆగస్టు 14న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి
అఫిడవిట్ ఇస్తారా ? క్షమాపణలు చెప్తారా ? – రాహుల్ కు ఈసీ డిమాండ్
దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమరి్పంచాలి. లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమర్పించాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు.
Also Read : TikTok: భారత్ లో మళ్లీ ‘టిక్‌టాక్’ ? ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి వెబ్ సైట్ !
