Bilkis Bano Sc Notice : బిల్కిస్ దోషుల విడుదలపై సుప్రీం నోటీస్
స్పందించాలంటూ గుజరాత్ సర్కార్ కు ఆదేశం
Bilkis Bano Sc Notice : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో కేసులో దోషులు 11 మందిని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వెంటనే స్పందించాలని, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల ఘటనలో భాగంగా ఐదు నెలల నిండు గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానోపై(Bilkis Bano) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆపై తన కళ్ల ముందే 5 ఏళ్ల చిన్నారితో పాటు కుటుంబీకులను దారుణంగా హత్య చేశారు. దీనిపై బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం సీబీఐకి అప్పగించింది.
కేసును పరిశీలించిన ప్రత్యేక కోర్టు 2008లో నేరం రుజువైందని దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉండగా దోషులలో పరివర్తన చోటు చేసుకుందని అందుకే వారిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం.
విచిత్రం ఏమిటంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15న హంతకులు, అత్యాచారానికి పాల్పడిన వారిని విడుదల చేసింది. కాలం చెల్లిన రిమిషన్ పాలసీ కింద విడుదల చేసింది.
ఇదిలా ఉండగా నేరానికి పాల్పడి, రుజువు అయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత 11 మంది దోషులను ఎలా విడుదల చేస్తారంటూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై గుజరాత్ సర్కార్ కు నోటీసు జారీ చేసింది.
Also Read : మనీ లాండరింగ్ చట్టం తీర్పుపై సమీక్ష