Tahawwur Rana: భారత్ కు తహవ్వుర్ రాణా ! సిద్ధంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు !
భారత్ కు తహవ్వుర్ రాణా ! సిద్ధంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు !
Tahawwur Rana : అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను భారత్‌కు ప్రత్యేక విమానంలో తీసుకు వస్తున్నారు. గురువారమే అతను భారత్‌కు చేరుకుంటాడని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. రాణా అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 26/11 దాడిగా ప్రసిద్ధమైన ముంబయి ఉగ్రదాడికి రాణా సూత్రధారిగా వ్యవహరించాడు. 2008లో నవంబరు 26న జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. అమెరికా తనను భారత్‌కు అప్పగించకుండా నిరోధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలనూ రాణా ఉపయోగించుకున్నాడు. చివరగా తన అప్పగింతను నిరోధించాల్సిందిగా కోరుతూ సమర్పించిన దరఖాస్తును అమెరికా(America) సుప్రీం కోర్టు ఇటీవల తిరస్కరించింది.
Tahawwur Rana to India
ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా(Tahawwur Rana) అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చేతికి చిక్కి లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్నాడు. 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి రాణా సన్నిహితుడని తెలుస్తోంది. తహవ్వుర్ రాణాను అమెరికా మనదేశానికి అప్పగిస్తోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, ఇతర ఉన్నతాధికారులతో ఈ పరిణామంపై సమీక్షించారు. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అతడిని తరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు.
రాణాను తీసుకువస్తోన్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే… అతడిని అక్కడినుంచి జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. అప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతోపాటు కొన్ని సాయుధ వాహనాలు వెంట ఉంటాయి. అలాగే ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ ను అలర్ట్ లో ఉంచారు. SWAT కమాండోలను విమానాశ్రయం వద్ద మోహరించారు.
ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మార్క్స్‌మ్యాన్ వాహనాన్ని సిద్ధంగా ఉంచారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సాయుధ వాహనం… ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలబడగలదు. దాడుల ముప్పు పొంచి ఉన్న వ్యక్తులను తరలించేందుకు భద్రతా సంస్థలు వీటిని ఉపయోగిస్తుంటాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు తీసుకువస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్ నియమితులయ్యారు. ముంబయి దాడి వెనక పాకిస్థాన్ నాయకుల పాత్రను నిర్ధరించే దిశగా విచారణ ఉండనుందని తెలుస్తోంది. దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
Also Read : Ahmed Basha: వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు బెయిల్