Tamilnadu Government: ఎన్‌ఈపీకి కౌంటర్‌ గా తమిళనాడులో నూతన విద్యావిధానం

ఎన్‌ఈపీకి కౌంటర్‌ గా తమిళనాడులో నూతన విద్యావిధానం

Tamilnadu Government : హిందీపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ జాతీయ విద్యా విధానానికి (ఎన్‌ఈపీ)కి కౌంటర్‌ గా తమిళనాడు (Tamilnadu Government) ప్రత్యేకంగా రాష్ట్ర విద్యావిధానం-2025ను తీసుకొచ్చింది. కొత్తూరుపురంలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ దీనిని ఆవిష్కరించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర బోర్డుతో సహా అన్ని బోర్డుల్లో విద్యార్థులు తమిళం చదువుతారని విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్‌నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ విమర్శించారు. ఇది రాష్ట్ర అహంకార విధానంగా అభివర్ణించారు.

జాతీయ నూతన విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం సహా పలు అంశాలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించనున్నట్లు గతంలో ఎం.కె.స్టాలిన్‌ ప్రకటించారు. ఇందుకోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మురుగేశన్‌ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని 2022లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర విద్యావిధానాన్ని రూపొందించి 2024 జులై 1న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో చెన్నైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘తమిళ్‌నాడు మానిల కల్వి కొళ్గై-2025-పళ్లి కల్వి’ (తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం-2025-పాఠశాల విద్య)ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

Tamilnadu Government – తమిళనాడు నూతన విద్యావిధానం కీలక అంశాలు

తమిళనాడులో తమిళం, ఆంగ్లం అనే ద్విభాషా విధానమే అనుసరించాలి.
10, 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే పబ్లిక్‌ పరీక్షలు.
ఈ విద్యా సంవత్సరం నుంచే 11వ తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు రద్దు.
ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించవచ్చు.
కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి భవిష్యత్తుకు అవరమైన నైపుణ్యాలను పెంపొందించే విద్యాబోధన అందించాలి.

Also Read : Shashi Tharoor: ప్లేట్ ఫిరాయించిన శశిథరూర్ ! మళ్ళీ రాహుల్‌కు జై కొట్టిన శశి !

Leave A Reply

Your Email Id will not be published!